ఈ మధ్య డెంటిస్ట్ దగ్గరికెళితే పన్ను పీకడానికి నానా అవస్థలు పడ్డాడు. క్యాప్‌కి ఇచ్చిన రూ.3 వేలు అడ్వాన్స్ వదులుకుని పారిపోయి వచ్చాను. విషాదం ఏమంటే బాగా చదువుకున్న వాళ్లు కూడా డాక్టర్ చదువుని మాత్రమే చూస్తాం తప్ప, అతను ఎక్కడ చదువుకున్నాడో, ఎన్ని మార్కులతో పాసయ్యాడో చూడం.
మనదేశంలో వైద్య విద్య ఖరీదయ్యేసరికి , చాలా మంది చైనా , రష్యా ఇలా రకరకాల దేశాల్లో చదివి వస్తున్నారు. వాళ్లేం నేర్చుకున్నారో తెలియదు. ఇక్కడ ప్రాక్టీస్ పెట్టేస్తారు. నిరక్షరాస్యత , పేదరికం ఎక్కువ ఉన్న ప్రజల మధ్య డాక్టర్ చదవకపోయినా , కాంపౌండర్లే వైద్యం చేసేస్తారు. మరి ఈ విదేశీ డాక్టర్లు ఎంత మందిని వైద్యం పేరుతో చంపుతున్నారో తెలియదు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో క్వాలిఫైడ్ డాక్టర్లే ఉంటారు కానీ, చెయ్యి బెణికితే, వంద టెస్టులు చేసి వేలల్లో బిల్లులేస్తారు. వాళ్లకి భయపడి మామూలు డాక్టర్ల దగ్గరికెళితే ఫీజులు తక్కువే కానీ, ప్రాణాలకి గ్యారెంటీ లేదు. అంతా చైనా సరుకు.
అయితే కొంచెం ఊరట ఏమంటే విదేశీ డాక్టర్లు ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ (FMGE) రాస్తేనే ఇక్కడ ప్రాక్టీస్‌కి అర్హులవుతారు.
ఆశ్చర్యం ఏమంటే విదేశాల్లో వైద్యం చదువుకున్న వాళ్లలో 84 శాతం మంది ఈ పరీక్షలో ఫెయిల్ అవుతున్నారు. రుమేనియా అజర్‌బైజాన్, మారిషస్‌లో చదివిన వాళ్లలో చాలా మందికి వైద్యం రాదు. చైనా, రష్యాల్లో చదివిన వాళ్లు 50 శాతం మంది ఇండియాలో ఫెయిల్ అయ్యారు. పిల్లల్ని డాక్టర్ చదివించాలనే కోరికతో యాడ్స్ చూసి తల్లిదండ్రులు మోసపోతున్నారు.
ఈ సారి డాక్టర్ దగ్గరికెళితే అతను ఏ దేశంలో చదివాడో తెలుసుకుని వెళ్లండి.