iDreamPost
iDreamPost
వరుస ఓటములతో పతనావస్థకు చేరుకున్న తెలుగుదేశం పార్టీని మళ్లీ గాడిలో పెట్టి.. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడానికి పార్టీ అధినేత చంద్రబాబు నానాపాట్లు పడుతున్నారు. తొలిసారి 2019లో సోలోగా పోటీ చేసి సొమ్మసిల్లిన ఆయన మళ్లీ బీజేపీని మచ్చిక చేసుకొని.. జట్టు కట్టేందుకు మహానాడు వేదిక సాక్షిగా చేసిన ప్రయత్నాలు ఆదిలోనే అడ్డం తిరిగాయి. దాంతో ఆ అవకాశం పోయినట్లే. ఇక మిగిలిన మార్గం ఒక్కటే.. అదే తన అజ్ఞాత మిత్రుడిని మరోసారి వాడుకోవడం. అయితే వాడుకోవాలంటే ముందు ఆ మిత్రుడు గట్టిగా.. దిట్టంగా ఉండాలి కదా! కానీ తన అజ్ఞాత మిత్రుడు పవన్ కళ్యాణ్ తీరు.. ఆయన పార్టీ పరిస్థితి చంద్రబాబు ఆశలను తుంచేస్తున్నాయి. తన పార్టీ ఎలా గట్టెక్కుతుందన్న బెంగ పుట్టిస్తున్నాయి.
తొలి నుంచీ పరస్పర సహకారం
పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో సొంత పార్టీ పెట్టినా తొలి నుంచీ చంద్రబాబు అజెండానే భుజానికెత్తుకున్నారు. 2013లో పార్టీ ఏర్పాటు చేసిన ఏడాదికే 2014లో జరిగిన ఎన్నికల్లో కొత్త పార్టీ అన్న సాకుతో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతుగా ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక పవన్ కోరిన పనులను చంద్రబాబు చేసి పెడితే.. ఆయన అజెండా ప్రకారం ప్రతిపక్ష వైఎస్సార్సీపీని పవన్ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలకు దూరమని ప్రకటించి బీఎస్పీ, వామపక్షాలతో కలిసి పోటీ చేశారు. కానీ చంద్రబాబుతో అజ్ఞాత స్నేహాన్ని మాత్రం వీడలేదు. పలు నియోజకవర్గాల్లో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు పార్టీలు సహకరించుకున్నాయి. పవన్ పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లో చంద్రబాబు ప్రచారం చేయకపోవడం, బాబు తనయుడు లోకేష్ పోటీ చేసిన మంగళగిరి ప్రచారంలోకి పవన్ అడుగుపెట్టకపోవడం దీనికి నిదర్శనం. ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ గాలిలో రెండు పార్టీలు కొట్టుకుపోయిన తర్వాత కూడా ఇదే పంథా కొనసాగుతోంది. పవన్ నటించిన వకీల్ సాబ్ సినిమా ప్రదర్శనల విషయంలో ఆయన తరఫున చంద్రబాబు వకాల్తా పుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం అందులో భాగమే.
బాబుకు ఇప్పుడెందుకు బెంగ అంటే..
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనతో జతకూడేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేకపోవడంతో ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఆయనకు అదేమంత పెద్ద సమస్య కాకున్నా.. జనసేనను పవన్ పట్టించుకోని ధోరణే మింగుడుపడటం లేదు. గత ఎన్నికల్లో దారుణ పరాభవం తర్వాతైనా పార్టీని పటిష్ట పరిచేందుకు జనసేనాని ప్రయత్నించడంలేదు. తన పంథాలో పార్ట్ టైమ్ రాజకీయాలే చేస్తున్నారు. ఇటీవల ఆయన రాష్ట్రానికి వస్తున్నారు.. ఇక పార్టీ కార్యకలాపాలను పరుగులెత్తిస్తారని జనసేన నాయకులు ఊదరగొట్టారు. పవన్ వచ్చినా ఒక మీటింగ్, ఒక ప్రెస్ మీటుతో సరిపెట్టారు. కొన్ని వర్గాల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అంతకు మించి ఏమీ జరగలేదు.
కానీ ఈ సందర్బంగా ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం జనసైనికుల్లో గందరగోళం సృష్టించాయి. ‘పార్టీని నడపడం అంత ఈజీ కాదు.. నిలబెట్టడం కూడా కష్టమే’.. అన్న ఆయన వ్యాఖ్యలు పార్టీ మనుగడపై అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. ఇవి కార్యకర్తల స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని, కొత్తగా పార్టీలో చేరాలనుకునే వారిని కూడా వెనక్కి లాగుతాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పార్టీ నడుస్తున్న తీరుపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. నమ్ముకున్న వర్గాల్లో వ్యతిరేకత పెరుగుతోంది. ఇవే అంశాలు చంద్రబాబును కూడా భయపెడుతున్నాయి. జనసేనను పవన్ పటిష్ట పరచకపోతే ఎన్నికల్లో సత్తా చూపలేరు. అటువంటప్పుడు వారితో కలసి పోటీ చేసినా ప్రయోజనం ఉండదని.. అది అంతిమంగా టీడీపీ ఆశలను గల్లంతు చేస్తుందని చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.