iDreamPost
iDreamPost
పశ్చిమ బెంగాల్లో మరోసారి రాజకీయ తుట్టె కదులుతోంది. ఆ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రంగా ప్రయత్నించి భంగపడిన బీజేపీ మరో రూపంలో రాష్ట్రంలోని సగభాగాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి కుట్ర పన్నిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సరిహద్దు భద్రతాదళాల (బీఎస్ఎఫ్) చట్టాన్ని ఆయుధంగా ప్రయోగిస్తోంది. ఆ చట్టాన్ని సవరించి బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరించింది. దాంతో బెంగాల్ రాష్ట్రంలో దాదాపు సగం ఉన్న ఉత్తర బెంగాల్ బీఎస్ఎఫ్ అదుపాజ్ఞల్లోకి వెళ్లింది. సరిహద్దు భద్రతాదళం నేరుగా కేంద్ర హోంమంత్రి పర్యవేక్షణలో ఉంటుంది. ఆ విధంగా పరోక్షంగా ఉత్తర బెంగాల్ పై ఆయన ఆధిపత్యం కొనసాగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చట్ట సవరణతో సగం ప్రాంతంపై పట్టు
అంతర్జాతీయ సరిహద్దు రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికార పరిధి దేశ అంతర్జాతీయ సరిహద్దు నుంచి 35 కిలోమీటర్ల లోపలివరకే ఉండేది. దాన్ని 50 కిలోమీటర్ల పరిధి వరకు పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్ చట్టంలో సవరణలు చేసింది. దీనివల్ల దేశంలోనే అత్యంత పొడవైన సరిహద్దు రేఖ ఉన్న బెంగాల్ రాష్ట్రం తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ఈ రాష్ట్రానికి బంగ్లాదేశ్ తో 2,216.7 కి.మీ. సరిహద్దు ఉంది. తర్వాత పాకిస్ధాన్ తో రాజస్థాన్ కు 1170 కి.మీ., గుజరాత్ కు 506 కి.మీ., పంజాబ్ కు 425 కి.మీ. సరిహద్దు ఉండగా.. బంగ్లాదేశ్ తో అసోంకు 267.5 కి.మీ. సరిహద్దు ఉంది. బీఎస్ఎఫ్ చట్ట సవరణ ప్రభావం ఈ రాష్ట్రలన్నింటిపైనా పడుతుంది. కానీ అత్యధికంగా బెంగాల్ ప్రభావితం అవుతుంది.
తాజా సవరణ వల్ల పశ్చిమ బెంగాల్లో 23 జిల్లాలకు గాను 10 జిల్లాలు.. 42 లోక్సభ నియోజకవర్గాలకు గాను 21 నియోజకవర్గాలు బీఎస్ఎఫ్ అధికార పరిధిలోకి వచ్చినట్లు అవుతుంది. డార్జిలింగ్ కొండల్లోని కుర్సీయాంగ్ నుంచి బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న సుందర్ బాన్స్ వరకు కేంద్ర బలగాల ఆధీనంలో ఉన్నట్లే. రాష్ట్రంలో కోల్ కతా తర్వాత పెద్ద నగరం సిలిగురి. నేపాల్, భూటాన్ దేశాలకు వెళ్లేందుకు ప్రవేశ ద్వారం లాంటి ఈ నగరం కూడా ఆ పరిధిలోనే చేరింది.
చట్టం ఉద్దేశమేమిటి?
దేశ అంతర్గత భద్రత, అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ, అక్రమ చొరబాట్ల నియంత్రణ బీఎస్ఎఫ్ చట్టం లక్ష్యాలు. ఈ చట్టం అమల్లో ఉన్న ప్రాంతాల్లో బీఎస్ఎఫ్ దళాలు గాలింపు చర్యలు చేపట్టవచ్చు, ఎవరినైనా నిర్బంధించవచ్చు. దీని పరిధిని 35 కి.మీ. నుంచి 50 కి.మీ. వరకు విస్తరించడం వల్ల ఉత్తర బెంగాల్ అంతటా రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండానే కేంద్ర బలగాల అదుపాజ్ఞల్లో ఉంటుందన్నమాట.
కేంద్రం రహస్య అజెండా
బీఎస్ఎఫ్ చట్ట సవరణను, పరిధి పెంపును బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ, పంజాబ్ సీఎం చరణ్ జిత్ చన్నీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వ రహస్య ఎజెండా ఉందని టీఎంసీ ఆరోపించగా, కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని పంజాబ్ సీఎం విమర్శించారు. చట్ట సవరణ లక్ష్యం సరిహద్దు రక్షణ, జాతీయ ప్రయోజనాలే అయితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాలతో ఎందుకు సంప్రదించలేదు, ఎందుకు సమాచారం ఇవ్వలేదని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభలో ఆ పార్టీ చీఫ్ విప్ సుఖేందు శేఖర్ రాయ్ ప్రశ్నించారు. కేంద్రం చర్య సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందన్నారు. గతంలో కేంద్రం, నాగా పీపుల్స్ ఫ్రంట్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఇస్తూ కేంద్ర బలగాలు ఆయా రాష్ట్ర పౌర పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి, వారి సహకారంతోనే కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టంగా ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఓడిపోయిన బీజేపీ ఉత్తర బెంగాల్లో మాత్రం అధికార తృణమూల్ కు గట్టి పోటీ ఇచ్చి.. గణనీయ విజయాలు సాధించింది. అప్పటి నుంచి ఆ ప్రాంతంపై శ్రద్ధ చూపుతోంది. జూలైలో జరిగిన కేంద్ర కేబినెట్ ప్రక్షాళనలో బెంగాల్ నుంచి నలుగురు మంత్రులను నియమించగా వారిలో ఇద్దరు ఉత్తర బెంగాల్ ప్రాంతీయులే. ఇక ఇటీవల కొత్తగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన ఎంపీ సుకాంత్ ముజుందార్ కూడా ఆ ప్రాంత నాయకుడే కావడం విశేషం. ఇవన్నీ కేంద్ర చర్యలపై అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నాయి.