iDreamPost
iDreamPost
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎదురుదాడి వ్యూహంతో అనుహ్య ఫలితాలు సాధించిన భారతీయ జనతా పార్టీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లోనూ అదే వ్యూహంతో సత్తా చాటాలని ఉవ్విళ్లూరింది. ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే.. అప్పటికింకా తిరుపతి ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న క్లారిటీ లేకపోయినా నానా హడావుడి చేసింది. తీరా ఇప్పుడు ఎన్నికల ముహూర్తం ప్రకటించిన వేళ.. ఆనాటి ఉత్సాహం, ఊపు కనిపించడం లేదు. గత మూడు నెలల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో చోటుచేసున్న పరిణామాలు ఆ పార్టీని వెనక్కి లాగుతున్నట్లుంది.
నాడు హడావుడి.. నేడు స్తబ్దత..
హైదరాబాద్ ఎన్నికలు ఇచ్చిన జోష్.. ఏపీ బీజేపీకీ కిక్ ఇచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోమూవీర్రాజు తదితరులు తిరుపతిలో మకాంవేసి.. కమలదళాన్ని ఎన్నికలకు సంసిద్ధం చేయడం ప్రారంభించారు. సోమూవీర్రాజు ఒకడుగు ముందుకేసి.. జనసేనతో ఉన్న పొత్తును పట్టించుకోకుండా తిరుపతిలో బీజేపీ అభ్యర్థే పోటీచేస్తారని అప్పట్లో ఏకపక్షంగా ప్రకటించేశారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో.. వీర్రాజు తన వ్యాఖ్యలను సరిదిద్దుకోవాల్సి వచ్చింది.
కూటమి తరపున ఎవరు పోటీ చేయాలన్నదానిపై ఒక కమిటీ వేసి నిర్ణయం తీసుంటామని ప్రకటించారు. ఉప ఎన్నిక తేదీ ప్రకటించడం, ఈ నెల 23 న నోటిఫికేషన్ విడుదల అవుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన కూటమి సమావేశంలో తిరుపతిలో బీజేపీ ఆభ్యర్థినే బరిలోకి దించాలని నిర్ణయించారు. ఇది జరిగి వారం పైనే అయ్యింది. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. అయినా ఇప్పటివరకు బీజేపీ తన అభ్యర్థిని నిర్ణయించలేదు. ఒకవైపు వైఎస్సారసీపీ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించి జోరు కనబరుస్తోంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ నాలుగు నెలల క్రితమే ప్రకటించిన తన అభ్యర్థి పనబాక లక్ష్మిని ఎట్టకేలకు ఒప్పించి కార్యోన్ముఖం చేసింది. అయితే వీటన్నింటి కంటే ముందు తిరుపతిలో ఎన్నికల సన్నాహాలు ప్రారంభించిన బీజేపీ కీలక తరుణంలో వెనుకబడింది.
వెనక్కిలాగుతున్న పలు అంశాలు
సుదీర్ఘ ఊగిసలాట తర్వాత తిరుపతిని బీజేపీ చేతిలో పెట్టేసిన పవన్ కల్యాణ్.. ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ నాయకత్వాన్ని. కోరుతున్నారు. హైదరాబాద్ లో చేసినట్లే పార్టీ జాతీయ నాయకులైన అమిత్ షా తదితరులు వచ్చి ప్రచారం చేయాలని సూచిస్తున్నారు. కానీ ఆయన సూచనలు అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. తిరుపతి ఎన్నికతో పాటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీటిలో అసోమ్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు బీజేపీకి అత్యంత కీలకం.
అసోంలో అధికారం కాపాడుకోవడం, బెంగాల్ లో పాగా వేయడాన్ని పార్టీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వాటిని వదిలి తిరుపతి ప్రచారానికి వచ్చే అవకాశం లేదు. మరోవైపు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో జనసేన కంటే బీజేపీ తక్కువ ఓట్లు పొందడం, తిరుపతి పార్లమెంట్ స్థానం పరిధిలోని తిరుపతి నగర పాలక సంస్థ తో పాటు.. అన్ని మున్సిపాలిటీ లను వైఎస్సార్సీపీ కైవసం చేసుకున్న పరిస్థితుల్లో తిరుపతిపై బీజేపీ పెట్టుకున్న ఆశలు నెరవేరే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ బీజేపీ జోరుకు బ్రేకులు వేశాయి.