Idream media
Idream media
మెగా టోర్నీ ఐపీఎల్ కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న క్రికెట్ అభిమానులకు త్వరలోనే బీసీసీఐ శుభవార్త చెప్పబోతోంది.పొట్టి క్రికెట్ ఫార్మేట్‌లోనే క్రేజీ టోర్నీ అయిన ఐపీఎల్ పదమూడో సీజన్ నిర్వహణపై బీసీసీఐ కసరత్తు ఒక కొలిక్కి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం అందుతుంది.
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ-20 వరల్డ్‌కప్‌ని ఐసీసీ వాయిదా వేయడంతో ఐపీఎల్ 2020కి లైన్ క్లియర్ అయింది.ఎట్టకేలకు ఐసీసీ నిర్ణయం వెలువడడంతో ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ తన చర్యలు వేగవంతం చేసింది.
ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం,ముగింపు వారాంతంలోనే ఉండేవిధంగా బీసీసీఐ ప్రణాళికను రూపొందించింది.ఈ మెగా టోర్నీని సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 న జరిగే ఫైనల్‌తో ముగిసేలా యూఏఈలో నిర్వహిస్తామని ఫ్రాంచైజీలకు బీసీసీఐ సమాచారం ఇచ్చింది.బీసీసీఐ ప్రతిపాదిత షెడ్యూలు ప్రకారం 44 రోజుల పాటు 60 మ్యాచ్‌లతో ఐపీఎల్ టోర్నీని నిర్వహించనున్నారు. కానీ నవంబరు 8న ఐపీఎల్ ఫైనల్ నిర్వహించడంపై టోర్నీ బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
నవంబరు 14 న దీపావళి కావడంతో పండగ సీజన్‌లో యాడ్స్ భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని స్టార్‌స్పోర్ట్స్ భావిస్తోంది.దీంతో ఐపీఎల్‌ని మరో రోజులు పొడిగించాలని స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది.పైగా ఐపీఎల్-2020 ఫైనల్ నవంబరు 15 న జరిగేలా షెడ్యూల్ మార్చాలని బ్రాడ్‌కాస్టర్ పట్టుబట్టినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.అయితే నవంబరు 15 వరకూ ఐపీఎల్ జరిగితే భారత్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లి డిసెంబరు 3 న ప్రారంభంకానున్న నాలుగు టెస్టుల సిరీస్‌కి సిద్ధమయ్యేందుకు సమయం సరిపోదని బీసీసీఐ వాదిస్తుంది.
యూఏఈ వేదికగా ఐపీఎల్:
దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతుండడంతో విదేశాలలో ఐపీఎల్‌ని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధపడింది.ఐపీఎల్ -2020 సీజన్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు యూఏఈ,శ్రీలంక, దక్షిణాఫ్రికా సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ యూఏఈలో ఐపీఎల్‌ని నిర్వహించడానికి బీసీసీఐ అంగీకరించినట్లు తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐపీఎల్ ఏడో సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లను యూఏఈ విజయవంతంగా నిర్వహించింది.ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ ఐపీఎల్‌ని యూఏఈ వేదికపై నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో యూఏఈ వేదికగా ఐపీఎల్–2020 నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని బీసీసీఐ కోరింది.సుమారు 5 నెలలకు పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్న భారత క్రికెటర్లకి అక్కడ ఓ క్యాంప్‌ని ఏర్పాటు చేయటానికి బీసీసీఐ సన్నాహకాలు ప్రారంభించింది. అలానే విదేశీ క్రికెటర్ల వీసాలు,ప్రయాణాలకు సంబంధించి బీసీసీఐ కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరింది.విదేశీ ఆటగాళ్లను యూఏఈకి రప్పించడం,ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉంచడం వంటి అంశాల దృష్ట్యా ప్రభుత్వం నుండి త్వరగా అనుమతి సంపాదించేందుకు బీసీసీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇక ఐపీఎల్ 2020 సీజన్‌ని దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చింది.దీంతో ఆటగాళ్లను తరలించడానికి చార్టెడ్ ఫ్లైట్స్‌ను అద్దెకు తీసుకోవడం, వసతి సౌకర్యాలపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి.
కాగా కేంద్రము నుండి అనుమతి లభించిన వెంటనే ఐపీఎల్ షెడ్యూల్,వేదికపై అధికారిక ప్రకటన చేయనుంది.ఒకవేళ ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకి సుమారు రూ.4000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది.దీంతో ఎలాగైనా ఐపీఎల్-2020 సీజన్ నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది.