వరుస ఓటములతో అసలే నిరాశతో ఉన్న శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటీవల పార్టీ ప్రకటించిన జిల్లా కార్యవర్గ కమిటీ నిర్మాణాన్ని చూసి మరింత కుంగిపోతున్నారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న తరుణంలో దూకుడుగా ముందుకెళ్లగలిగే యువ నాయకులకు కాకుండా.. ఇప్పటి తరానికి ముఖపరిచయమే లేని పాతకాపులను మళ్లీ తెరపైకి తెచ్చి కార్యవర్గ కమిటీని నింపేయడమేమిటని నిర్వేదంతో ప్రశ్నిస్తున్నారు. ఈ కార్యవర్గంతో అధికార పక్షాన్ని ఎదుర్కోలేమని.. పార్టీ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లగలగడం కూడా కష్టమేనని పలువురు కింది స్థాయి నాయకులు పెదవి విరుస్తున్నారు.
ఆరు నెలల ఆలస్యం
అంతకు ముందు జిల్లాలవారీగా ఉన్న పార్టీ నిర్మాణాన్ని అధికార వైఎస్సార్సీపీ మాదిరిగా పార్లమెంటు జిల్లాలుగా వర్గీకరించారు. ఆ మేరకు శ్రీకాకుళం పార్లమెంటు జిల్లాకు మాజీ విప్ కూన రవికుమార్ ను అధ్యక్షుడిగా నియమించారు. ఆరు నెలల క్రితం ఈ నియామకం జరిగినా కార్యవర్గాన్ని మాత్రం ప్రకటించలేకపోయారు. పదవుల పంపకాల్లో సర్దుబాట్లు కుదరకపోవడం.. జిల్లా, రాష్ట్ర అధ్యక్షులైన కూన రవి, అచ్చెన్నాయుడులు ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వంటి కారణాలతో కార్యవర్గ కూర్పు ఆరు నెలలు ఆలస్యమైంది. ఇంత సుదీర్ఘ కసరత్తు, మంతనాల తర్వాత కూడా పదవులు దక్కలేదన్న అసంతృప్తితో పాటు కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఎప్పుడో ఎన్టీఆర్ తరం నేతలను పదవుల్లో కూర్చోబెట్టడాన్ని పార్టీలోని ఈ తరం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దూసుకుపోగలిగే యువ నాయకలను కాదని.. టీడీపీ పెట్టిన తొలినాళ్లలో పనిచేసిన వెలమల కామేశ్వరరావు, బలగ నాగేశ్వరరావు, సీపాన వెంకటరమణ, హనుమంతు రామకృష్ణ వంటి వారికి కార్యవర్గంలో కీలక పదవులు కట్టబెట్టారు. ఈ వృద్ధనేతలతో ఎలా పనిచేయగలమని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రధాన కార్యదర్శి పదవిపై పంతం
కమిటీలో అతి ముఖ్యమైన ప్రధాన కార్యదర్శి పదవిపై పెద్ద రాద్ధాంతమే జరిగింది. ఈ పదవిని కాపు సామాజిక వర్గానికి చెందిన మామిడి గోవిందరావుకు ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు కూన రవి ప్రతిపాదించారు. అయితే డీసీసీబీ మాజీ చైర్మన్ సింతు సుధాకర్ ఆయనతో పోటీ పడ్డారు. మధ్యే మార్గంగా మామిడికి ప్రధాన కార్యదర్శి, సుధాకర్ కు కార్యాలయ కార్యదర్శి పదవి ఇవ్వాలనుకున్నారు. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ జోక్యం చేసుకొని మామిడి గోవిందరావుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తే.. ఇక తనను పార్టీ కార్యక్రమాలకు పిలవనవసరం లేదని అల్టిమేటం ఇచ్చారు. మరోవైపు ఆ పదవి తప్ప ఇంకేదీ తనకు వద్దని మామిడి భీష్మించుకున్నారు. చివరికి వీరెవరికీ కాకుండా గౌతు శివాజీ అనుయాయుడైన పీరుకట్ల విఠల్ ఆ పదవిని తన్నుకుపోయారు. మరోవైపు పార్లమెంట్ జిల్లా కమిటీల వల్ల ఎచ్చెర్ల నాయకులు ఎటూ కాకుండాపోయారు. శ్రీకాకుళానికి ఆనుకుని ఎచ్చెర్ల నియోజకవర్గం ఉంటుంది. జిల్లా యూనిట్ గా కమిటీలు ఉన్నప్పుడు ఎచ్చెర్లకు చెందిన సీనియర్ నాయకులు చౌదరి బాబ్జీ, కలిశెట్టి అప్పలనాయుడు వంటి వారికి కీలక పదవులు దక్కేవి. పార్లమెంటు జిల్లాలు చేయడం వల్ల అది విజయనగరం పార్లమెంటు జిల్లా కమిటీ పరిధిలోకి వెళ్ళిపోయింది. ఆ జిల్లా నేతలతో ఎచ్చెర్ల నాయకులకు అటాచ్మెంట్ తక్కువ. దాంతో రెండు కమిటీల్లోనూ చోటు దక్కక అయోమయంలో పడిపోయారు.