Idream media
Idream media
తెలంగాణలో టీడీపీ ఉందా అంటే.. ఉందని మాత్రమే చెప్పుకునే పరిస్థితి. చంద్రబాబునాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇటు తెలంగాణకు పూర్తిగా దూరం అయ్యారు. అడపాదడపా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడి నేతలతో మాట్లాడినా సరైన దిశా నిర్దేశం చేయలేకపోయారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అయ్యారు. అయితే కరోనా కాలంలో ఏపీకి దూరంగా హైదరాబాద్ కే పరిమితమైన చంద్రబాబు నాయుడు టీ.టీడీపీపై కాస్త దృష్టి సారించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో మాట్లాడుతూ కమిటీలు వేయాలని సూచించారు. కొన్ని చోట్ల కమిటీల ఏర్పాటుకు సభ్యులు దొరకని పరిస్థితి ఉంది. దీనికితోడు తెలంగాణ తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాట మొదలైంది. నాయకత్వ మార్పు కోరుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
ఎల్. రమణను మార్చాలంటూ…
ఏడేళ్లుగా టీ.టీడీపీకి ఎల్. రమణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర కమిటీలో సభ్యులు కూడా పూర్తి స్థాయిలో లేరు. చాలా మంది ప్రముఖ నేతలు టీఆర్ఎస్ జెండా కప్పుకున్నారు. రెండేళ్లకొకసారి కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉన్నా పార్టీలోకి ఎవరూ రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పార్టీ పునరుజ్జీవం పొందాలంటే అధ్యక్షుడిని మార్చాల్సిన అవసరం ఉందని పలువురు టీడీపీ నేతలు అధినేత చంద్రబాబుకు లేఖాస్త్రాలు సంధిస్తున్నారు. స్వయంగా కలిసి విన్నవించుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉనికిని కోల్పోతున్న తెలుగుదేశం పార్టీకి జవజీవాలను అందించడంతో పాటుగా, పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్ళడం కోసం ప్రయత్నం జరగడం లేదని టిడిపి నేతలలో అసహనం వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలో అధినేత చంద్రబాబుకు పలువురు టీడీపీ నేతలు లేఖ రాశారు.
బలహీనపడ్డ టీడీపీ
టిడిపిలో కీలకంగా వ్యవహరించిన ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి వంటి నేతలు పార్టీని వీడి బయటకు వెళ్లడంతో పార్టీ బలహీనపడింది. ఈ క్రమంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలను అప్పటినుండి ఇప్పటివరకు రమణ ఒక్కడే పట్టుకొని ముందుకు నడిపిస్తున్నారు. అయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అయినా, చంద్రబాబు పట్టించుకోవాలని డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికైనా బలహీన వర్గాలకు చెందిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించి, పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకోవాలని టిడిపి నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకు వెళుతున్నారు. తెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉన్నకారణంగా వారిని కాపాడుకోవలసిన అవసరం ఉందని క్షేత్ర స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జ్ లను నియమిస్తే కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి వెసులుబాటు కలుగుతుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మనుగడ కోసం పోరాటం..
పార్టీలో నూతనోత్సాహం నింపి, పార్టీని ముందుకు నడిపించకుంటే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని అధినేత దృష్టికి తీసుకు వెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిస్థాయిలో కుదేలైంది. అధికార పార్టీ పై ఏమాత్రం ఒత్తిడి తీసుకు రాలేని పార్టీగా, మనుగడ కోసం పోరాటం చేస్తున్న పార్టీగా తెలుగుదేశం పార్టీ మిగిలిపోయింది. తెలుగు రాష్ట్రాల విభజన నాటి నుండి తెలంగాణ రాష్ట్రంపై పెద్దగా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబు, ప్రస్తుత పరిస్థితుల్లో అయినా తెలంగాణ టిడిపిపై దృష్టి సారిస్తారా ? అధ్యక్షుడితో పాటుగా, తెలంగాణ నాయకత్వాన్ని మారుస్తారా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.