iDreamPost
iDreamPost
తల్లి ప్రేమ విషంగా మారడం అసలు ఊహించగలమా. సృష్టిలో అమ్మ కన్నా గొప్పది ఏదీ లేదనేది ఎవరైనా ఒప్పుకునే వాస్తవం. కానీ బిడ్డల జీవితాలు నాశనం కావాలని కోరుకునే మాతృమూర్తులు ఉంటారా. ఈ పాయింట్ తో వచ్చిన సినిమానే అబ్బాయిగారు. దీని వెనుక చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1959లో పి పుల్లయ్య గారు ఏఎన్ఆర్ సావిత్రి జంటగా ‘అర్ధాంగి’ చిత్రం తీశారు. ఇది స్వయం సిద్దా అనే బెంగాలీ నవల ఆధారంగా రూపొంది ఘన విజయం సొంతం చేసుకుంది. దీన్నే తమిళ్ లో పుల్లయ్య గారే 1963లో ‘పెన్నిన్ పెరుమై’గా రీమేక్ చేశారు. అదే సంవత్సరం హిందీలో ‘బహురాణి’గా పునఃనిర్మాణం అయ్యింది. అన్నీ హిట్లే.
ఇదే కథతో 1969లో కన్నడలో ‘మల్లమ్మన పావడ’ అనే సినిమా వచ్చింది. ఇది అదే పేరుతో వచ్చిన నవలను బేస్ చేసుకుని తీస్తే సూపర్ హిట్ అయ్యింది. దీనికి స్క్రీన్ ప్లే పుల్లయ్య గారే సమకూర్చారు. కథా వస్తువు ఒకటే. కట్ చేస్తే కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 1987లో భాగ్యరాజా ఇదే స్టోరీ తీసుకుని ‘ఎంగ చిన్న రాస’గా మళ్ళీ రీమేక్ చేశారు. అనూహ్యంగా ఇదీ సూపర్ హిట్టే. తెలుగులో ‘చిన్నరాజా’గా డబ్బింగ్ చేస్తే బాగానే ఆడింది. తర్వాత దీన్ని 1993లో ‘అబ్బాయిగారు’గా ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రాశి మూవీస్ నరసింహారావు గారు వెంకటేష్ మీనా హీరో హీరోయిన్లుగా జయచిత్ర తల్లి పాత్రలో కీరవాణి సంగీతం సమకూర్చగా మంచి బడ్జెట్ తో నిర్మించారు. చూసిన కథే అయినా ప్రేక్షకులు మళ్ళీ సక్సెస్ అందించారు.
దీనికన్నా ముందే 1992లో అనిల్ కపూర్ తో ‘బేటా’గా ఇది బాలీవుడ్ లో జెండా ఎగరేసింది. అదే ఏడాది కన్నడలో రవిచంద్రన్ ‘అణ్ణయ్య’ పేరుతో తీసి తన ఖాతాలో మరో హిట్టుని సొంతం చేసుకున్నారు. ఎటు తిరిగి ఇది ఆలస్యం అయ్యింది తెలుగులోనే. దీనికి పలు కారణాలు దోహదపడ్డాయి కానీ ఫైనల్ గా అబ్బాయిగారు బాషాభేదం లేకుండా అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయ్యింది. తల్లిని విపరీతంగా ప్రేమించే కొడుకు ఆవిడ మనసులో విషబీజాలు ఉన్నా గుర్తించలేనంత అమాయకత్వంలో ఉంటాడు. భార్య వచ్చి కనువిప్పు కలిగించినా అమ్మను ద్వేషించడు. అందుకే ఈ సబ్జెక్టు ఫామిలీ ఆడియన్స్ కి విపరీతంగా కనెక్ట్ అయ్యింది.