iDreamPost
iDreamPost
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు. అదెంత నిజమో తెలియదుగానీ.. కార్యాలయాలు, పని ప్రదేశాలు వంటివి రెండు మనసులను కలిపి వివాహబంధం పెనవేస్తున్న ఉదంతాలు మన చుట్టుపక్కల సమాజంలో చాలానే చూస్తుంటాం, వింటుంటాం. కానీ రాజకీయాలు రెండు హృదయాలను ముడిపెట్టిన ఘటనలు మాత్రం చాలా అరుదనే చెప్పాలి. కేరళలో అటువంటి అరుదైన వైవాహిక బంధం అల్లుకుంది. వారి భావజాలం ఒకటే.. పనిచేస్తున్న పార్టీ ఒకటే.. ఇద్దరూ అతి చిన్న వయసులో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన రికార్డ్ సొంతం చేసుకున్నారు. ఇన్ని సారూప్యతలు ఉన్న వారి మధ్య ఇన్నాళ్లూ అల్లుకున్న స్నేహబంధం వారి మనసులను ప్రేమతో కట్టిపడేసింది. పార్టీలో కలిసి పనిచేస్తున్న వారిద్దరూ జీవితంలోనూ కలిసి నడవాలని నిర్ణయించుకున్నారు. వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. కేరళ ఎమ్మెల్యే కేఎం సచిన్ దేవ్, తిరువనంతపురం మేయర్ ఆర్య రాజేంద్రన్ లే కాబోయే ఆ కొత్త జంట.
పదవుల సాధనలో రికార్డులు
ఆర్య రాజేంద్రన్(23) సీపీఎం కార్యకర్త. ఆ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా, సీపీఎం చిల్డ్రెన్స్ వింగ్ అయిన బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 2020 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో కేరళ రాజధాని అయిన తిరువనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేసి కార్పొరేటరుగా ఎన్నికయ్యారు. 100 వార్డుల్లో ఎల్డీఎఫ్ 52 సీట్లు కైవసం చేసుకోవడంతో పార్టీ ఆర్య రాజేంద్రన్ ను మేయర్ చేసింది. అప్పటికి ఆమె వయసు 21. దేశంలో అతి చిన్న వయసులో మేయర్ పదవి చేపట్టిన నేతగా ఆమె రికార్డ్ సృష్టించారు.
ఇక సచిన్ దేవ్ (28) గత ఏడాది ఏప్రిల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బలుస్సెరి నియోజకవర్గం నుంచి సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి 20వేల మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుత కేరళ అసెంబ్లీలో అతనే అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ఈయన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇద్దరినీ కలిపిన పార్టీ
ఎస్ఎఫ్ఐలో కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్న ఆర్య, సచిన్ మంచి స్నేహితులుగా మారారు. ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునేవారు. ఒకే భావజాలం, ఒకే రకమైన ఆలోచనలు వారిని క్రమంగా మరింత దగ్గర చేశాయి. పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయానికి వచ్చేలా చేశాయి. విషయాన్ని ఇద్దరూ తమ కుటుంబ పెద్దలకు చెప్పి వారి అంగీకారం తీసుకున్నారు. రాజకీయాల్లో ఉంటూ బాధ్యతాయుత పదవులు నిర్వహిస్తున్నందున కుటుంబంలాంటి పార్టీ పెద్దలకు కూడా తమ నిర్ణయం గురించి తెలియజేసి ఆమోదం పొందారు. వివాహబంధాన్ని పెనవేసుకోవాలని తాము నిర్ణయించున్నామని, పెళ్లి తేదీ ఇంకా ఖరారు కాలేదని ఎమ్మెల్యే సచిన్, మేయర్ ఆర్య రాజేంద్రన్ పేర్కొన్నారు.