iDreamPost
android-app
ios-app

Freedom Series, India vs South Africa, First Test – రసకందాయంలో తొలి టెస్టు

  • Published Dec 29, 2021 | 5:04 PM Updated Updated Mar 11, 2022 | 10:29 PM
Freedom Series, India vs South Africa, First Test – రసకందాయంలో తొలి టెస్టు

భారత్‌… దక్షిణాఫ్రికా తొలి టెస్టు రసకందాయంలో పడింది. ప్రస్తుతానికి విజయం భారత్‌ వైపు మొగ్గుచూపుతున్నా… దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఆరు వికెట్లు ఉండడం… ఏ ఇద్దరు భారీ భాగస్వామ్యం నెలకొల్పినా ఫలితం తారుమారయ్యే అవకాశముంది. ఇక్కడ సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో 304 పరుగుల విజయలక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్‌ ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టు 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలలో పడింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 211 పరుగులు చేయాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.

అయితే కీలక వికెట్లు కోల్పోవడంతో విజయ లక్ష్యం చిన్నదే అయినా కష్టంగా మారింది. ఇదే సమయంలో 52 పరుగులతో జట్టు కెప్టెన్‌ ఎల్గర్‌ క్రీజ్‌లో ఉండడం ఆ జట్టుకు ఫలితంపై ఆశలు నెలకొన్నాయి. ఓపెనర్‌ మార్కరమ్‌ కేవలం ఒక పరుగు చేసి ఔటు కాగా, పీటర్సన్‌ 17 పరుగులు, డసెన్‌ 11 పరుగులు, మహరాజ్‌ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఎల్గర్‌ మాత్రం క్రీజ్‌లో కుదురుకుని బ్యాటింగ్‌ చేస్తున్నాడు. ఇతనితోపాటు బవుమా, డికాక్‌, మల్డర్‌ వంటి వారు బ్యాటింగ్‌ చేయాల్సి ఉంది. భారత్‌ జట్టు తరపున రెండవ ఇన్నింగ్స్‌లో బుమ్రా రెండు వికెట్లు తీయగా, షమీ, సిరాజ్‌లు చెరొకటి చొప్పున వికెట్లు సాధించారు.

అంతకుముందు 16 పరుగులకు ఒక వికెట్‌ ఓవర్‌ నైట్‌ స్కోర్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు కేవలం 174 పరుగులకే ఆల్‌ఔట్‌ అయ్యింది. భారత్‌ వేగంగా భారీ స్కోర్‌ చేసి దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం పెడుతుందని అనుకున్నారు. అయితే రబడ,జాన్సెన్‌లు కలిసి భారత్‌ బ్యాటింగ్‌ వెన్ను విరిచారు. వీరిద్దరూ కలిసి చెరో నాలుగు వికెట్లు తీయడం ద్వారా భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ తొలి ఇన్నింగ్స్‌ హీరో 23 పరుగులు మాత్రమే చేశాడు. మరో ఓపెనర్‌ అగర్వాల్‌ 4, ఠాకూర్‌ 10, పుజారా 16, కెప్టెన్‌ కోహ్లి 18, రహానే 20, పంత్‌ 34, అశ్విన్‌ 14, షమీలు ఒక పరుగు చేసి ఔటయ్యారు. బుమ్రా ఏడు పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.