ఇంగ్లండ్‌ను చుట్టేసిన అక్షర్,అశ్విన్
ఇంగ్లండ్-ఇండియా మధ్య పేటీఎం సిరీస్‌లో భాగంగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. 49 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ (25; 25 బంతుల్లో 3×4, 1×6), శుభ్‌మన్ గిల్ (15; 21 బంతుల్లో 1×4, 1×6)రాణించడంతో వికెట్లేమి కోల్పోకుండానే పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాలుగు టెస్టుల సిరీస్ లో రెండు విజయాలు సాధించి 2-1తో ముందంజలో ఉంది.
ముప్పుతిప్పలు పెట్టిన రూట్
99/3 ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాను తనదైన స్పిన్ బౌలింగ్ తో ఇంగ్లండ్ సారధి రూట్ ముప్పుతిప్పలు పెట్టాడు..మొతేరా స్టేడియం స్పిన్ కు అనుకూలించడం,ఇంగ్లండ్ జట్టులో లీచ్ తప్ప మరో స్పిన్నర్ లేకపోవడంతో బంతిని అందుకున్న రూట్ తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.భారత బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికాలం చేసిన రూట్ టీమిండియా చివరి ఐదు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం6.2 ఓవర్లు బౌల్ చేసిన రూట్ 3 మెయిడెన్ల సహాయంతో 8 పరుగులు ఇచ్చి 5 వికెట్లను నేల కూల్చాడు.. దీంతో ఓవర్ నైట్ స్కోరుకు మరో 46 పరుగులు మాత్రమే జోడించిన భారత్ 145 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో 33 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని టీమిండియా సంపాదించింది.
చుట్టేసిన అక్షర్.. అశ్విన్..
టీమిండియాను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేశామని ఆనంద పడిన ఇంగ్లండ్ జట్టుకు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. రెండో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్ తొలిబంతికే అక్షర్ పటేల్ ఓపెనర్ జాక్ క్రాలే(0) బౌల్డ్ చేసాడు. అదే ఓవర్లో మూడో బంతికి బెయిర్‌స్టోను బౌల్డ్ చేయడంతో స్కోరు బోర్డులో పరుగులేమీ చేరకుండానే ఇంగ్లండ్ జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. 7 పరుగులు చేసిన సిబ్లీని కూడా అక్షర్ పటేల్ కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ కు పంపడంతో 19పరుగులకే ఇంగ్లండ్ జట్టు మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఇంగ్లండ్ సారధి జో రూట్ (19)తో కలిసి బెన్‌స్టోక్స్ (25) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ జోడిని అశ్విన్ విడదీసాడు. స్టోక్స్‌ను ఎల్బీడబ్ల్యూ చేసిన అశ్విన్ టెస్టుల్లో ఎక్కువ సార్లు స్టోక్స్‌ను ఔట్ చేసిన బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
అక్షర్ & అశ్విన్ స్పిన్ ద్వయం క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లండ్ 80 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. 30.4వ బంతికి చివరి వికెట్ అయిన అండర్సన్ (0)ను వాషింగ్టన్ సుందర్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. దీంతో భారత లక్ష్యం 49 పరుగులుగా నమోదయింది. అక్షర్ పటేల్ 5 వికెట్లు సాధించగా అశ్విన్ నాలుగు వికెట్లు, సుందర్ ఒక వికెట్ సాధించారు.
రికార్డులే రికార్డులు..
ప్రపంచంలో అత్యంత పెద్ద క్రికెట్ మైదానంగా రూపుదిద్దుకున్న మొతేరా మైదానంలో జరిగిన మూడో టెస్టులో పలు రికార్డులు నమోదయ్యాయి. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన మూడో టెస్టులో 81 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ ఇండియాలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది.గతంలో ఈ స్కోరు 101 గా ఉంది. డే నైట్ టెస్టులో 11 వికెట్లు సాధించిన మూడో బౌలర్ గా అక్షర్ పటేల్ నిలిచాడు. గతంలో పాట్ కమిన్స్, దేవేంద్ర బిషు పదేసి వికెట్లు సాధించారు. అత్యల్ప మ్యాచుల్లో 400 వికెట్లను సాధించిన బౌలర్ గా అశ్విన్ నిలిచాడు. 77 మ్యాచుల్లో ఈ ఘనతను సాధించిన అశ్విన్ 72 మ్యాచుల్లో 400 వికెట్లు సాధించిన ముత్తయ్య మురళీధరన్ వెనుక నిలిచాడు. భారత్ లో జరిగిన టెస్టుల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్ గా 29 టెస్టుల్లో 22 విజయాలు సాధించి కెప్టెన్ గా అత్యధిక విజయాలు సాధించిన ధోని రికార్డును దాటాడు. ధోని నాయకత్వంలో 30 టెస్టుల్లో 21 విజయాలను భారత్ సాధించింది.. డే నైట్ మ్యాచులో అత్యధిక వికెట్లను స్పిన్నర్లే సాధించడం గమనార్హం. స్పిన్నర్లు 28 వికెట్లు సాధించగా పేసర్లు 2 వికెట్లు మాత్రమే సాధించడం విశేషం..