iDreamPost
android-app
ios-app

బాక్సింగ్ డే టెస్టు – పట్టు బిగించిన భారత్

బాక్సింగ్ డే టెస్టు – పట్టు బిగించిన భారత్

బాక్సింగ్ డే టెస్టు మూడో రోజు ఆటలో భారత్ పూర్తిస్థాయిలో పట్టు బిగించింది. స్వల్ప వ్యవధిలోనే వికెట్లు చేజార్చుకున్న భారత్ తదనంతరం తన ఆటతీరుతో ఆసీస్ కు ముచ్చెమటలు పట్టించింది.

277/5 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ 49 పరుగుల వ్యవధిలోనే ఐదు వికెట్లు చేజార్చుకుని 131 పరుగుల కీలక ఆధిక్యాన్ని సంపాదించింది. లంచ్ విరామం తర్వాత ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభం అయిన మూడు ఓవర్లలోనే ఉమేష్ యాదవ్ జోబర్న్స్ ని ఔట్ చేసి ఆసీస్ పతనానికి నాంది పలికాడు. అనంతరం జాగ్రత్తగా ఆడుతున్న మార్నస్‌ లబుషేన్‌(28; 49 బంతుల్లో 1×5) రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్ లో రహానేకు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ 42 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ మరోసారి నిరాశ పరచగా వేడ్‌, టిమ్‌పైన్‌(1), ట్రావిస్‌ హెడ్‌(17) ఒక్క పరుగు తేడాలో ఔటయ్యారు. దీంతో ఆసీస్ 99 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

ఈ దశలో కామరూన్‌ గ్రీన్, పాట్‌ కమిన్స్‌ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడటంతో మూడో రోజు ఆట నిలిచే సమయానికి జట్టు స్కోరు 133/6కి చేరింది. దీంతో ఆసీస్ కు 2 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు సాధించగా, బుమ్రా, ఉమేష్ యాదవ్,సిరాజ్,అశ్విన్ తలో వికెట్ సాధించారు. నాలుగోరోజు ఆటలో నిలబడి భారీ ఆధిక్యం కట్టబెడితే తప్ప ఆసీస్ గెలవడం అసాధ్యంగా కనిపిస్తుంది. ఆసీస్ ప్రధాన బ్యాట్స్మెన్ అంతా ఔట్ కావడం ప్రస్తుతం క్రీజులో ఉన్నది టెయిలెండర్స్ కావడంతో భారత విజయం సాధించడం దాదాపు లాంఛనమే అని చెప్పుకోవచ్చు.