iDreamPost
android-app
ios-app

ఉన్నది 90 మంది.. పొలైంది మాత్రం 171 ఓట్లు

ఉన్నది 90 మంది.. పొలైంది మాత్రం 171 ఓట్లు

అస్సోం ఎన్నికల్లో అవకతవకలు బయటపడుతున్నాయి. మొదటి దశ పోలింగ్‌లో ఈవీఎంలపై ఆరోపణలు రాగా, రెండో దశ పోలింగ్‌లో ఓ పోలింగ్‌ బూత్‌ పరిధిలో అధిక సంఖ్యలో దొంగ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. ఆ బూత్ పరిధిలో 90 మంది ఓటర్లు ఉంటే 171 ఓట్లు పోలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీంతో అధికారులు పరిశీలించి పోలింగ్‌ రోజున అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. అక్కడ రీపోలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. అసోంలోని డిమా హాసావో జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఏప్రిల్‌ 1న అసోంలో జరిగిన రెండో దశ ఎన్నికల్లో భాగంగా హాఫ్లాంగ్‌ నియోజక వర్గానికి పోలింగ్‌ జరిగింది. ఖోట్లిర్‌ ఎల్పీ స్కూల్‌లో ఓ పోలింగ్‌ బూత్‌ను ఏర్పాటు చేయగా అందులో అవకతవకలు జరిగాయి. ఓటర్ల కన్నా పోలయిన ఓట్లు అధికంగా ఉండడంతో ఆ బూత్‌లో పనిచేసిన ఐదుగురు ఎన్నికల అధికారులపై జిల్లా ఎన్నికల అధికారి సస్పెన్షన్‌ వేటు వేశారు.

ఇదిలా ఉండగా, 126 మంది సభ్యులు అస్సోం అసెంబ్లీకి మూడు విడతల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఇప్పటికే రెండు విడతలు పూర్తి కాగా.. మంగళవారం తుది దశలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈశాన్య భారతంలో బీజేపీ అగ్రనేత, రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్‌కుమార్‌ దాస్‌ సహా 337 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎన్‌డీఏకు, కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమికి మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. మూడో దశలో 79 లక్షల 19,641 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్స్ (యూపీపీఎల్), కాంగ్రెస్ కూటమిలో ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఆంచలిక్ గణ్ మోర్చా, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇదివరకు బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్.. బీజేపీతో ఉండేది. అయితే మిత్రపక్షాలకు బీజేపీ సముచిత స్థానం ఇవ్వలేదని చెబుతూ ఆ పార్టీ కాంగ్రెస్ గూటికి చేరింది. రాయ్‌జోర్ దళ్, అస్సాం జాతీయ పరిషత్ మూడో కూటమిగా బరిలోకి దిగాయి. ఆయా నియోజకవర్గాల్లో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లపై హామీలు గుప్పించాయి.