Idream media
Idream media
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసుల సంఖ్య ఎంతో తెలుసా.. 13, 681 మాత్రమే. జూలై నెలలో దేశ వ్యాప్తంగా కరోనా రాకెట్ హైస్పీడు లో దూసుకెళ్తుంటే… ఢిల్లీ మాత్రం ఆ స్పీడుకు బ్రేకులేసింది. ఒకప్పుడు రోజుకు 5 వేల కేసుల వరకు నమోదయ్యేవి. కానీ ప్రస్తుతం 1000కి అటు ఇటుగానే నమోదవుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 15 నాటికే 2.25 లక్షల కేసులు నమోదవుతాయన్న ప్రభుత్వం అంచనా వేసింది. కానీ శుక్రవారం నాటికి ఇక్కడ కేసుల సంఖ్య 1.28 లక్షలు. ప్రతి చోటా అంచనాలకు మించి కేసులు నమోదైతే.. ఢిల్లీ లో మాత్రం పరిస్థితి విభిన్నంగా ఉంది. ఒకప్పుడు కరోనా టెర్రర్ తో వణికిపోయిన ప్రజలు ఇప్పుడు కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇదెలా సాధ్యం..? అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టారు..? తెలుసుకుంటే.. కలిసి పోరాడితే కరోనా అయినా తలవంచకు తప్పదు అనే విషయం అర్థం అవుతుంది.
కరోనా మహమ్మారి విజృంభణ తొలి నాళ్లలో దీన్నో రాజకీయ అవకాశ వాదంగా ప్రతిపక్షాలు తీసుకున్నాయి. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు స్థానిక నేతలు ఎప్పుడూ ప్రయత్నించేవారు. ప్రభుత్వానికి కరోనా తో పోరుతో పాటు.. ఈ తలనొప్పులు ఎక్కువగా ఉండేవి. ముఖ్యంగా బీజేపీ, ఆప్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నాయి. దీనికి తోడు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు ఆప్ సర్కారును కుదిపేశాయి. అలాగే.. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ తో వివాదాలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా ఉండేవి.
కేంద్రం సహకారంతో…
ఇరు పార్టీ మధ్య వివాదాలు తారా స్థాయికి చేరుతుండడం, మరోవైపు కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తుండడంతో కేంద్రం ఢిల్లీ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించింది. ఇటువంటి పరిస్థితుల్లో వివాదాలు ముదిరితే అటు కేంద్రానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదనే ఉద్దేశంతో హోం మంత్రి అమిత్ షా ను కేంద్రం రంగంలోకి దింపింది. సీఎం కేజ్రీవాల్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అనంతరం ఢిల్లీ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సమావేశం అనంతరం కరోనా కట్టడికి కేంద్రం నుంచి ప్రత్యేక అధికార బృందాన్ని నియమించారు. రాష్ట్రంలోని పరిస్థితులను ఆ బృందం పరిశీలించి తగు సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి చేయడంతో పాటు.. కేంద్రం చేయాల్సిన పనులపై కూడా నివేదిక ఇచ్చేది. వైరస్ వ్యాప్తి అడ్డుకట్టకు కేంద్రం సూచనలకు అనుగుణంగా నడుస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ప్రకటించారు.
ఉమ్మడి గానే విజయం..
ఢిల్లీ ప్రజానీకం, కేంద్రం, రాష్ట్రం ఉమ్మడిగానే ఈ విజయం సాధించినట్లు సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేయడంతో విజయానికి కారణాలు అర్థం చేసుకోవచ్చు. ఒక్క ప్రభుత్వమే కరోనాను ఎదుర్కోవాలని భావించి ఉంటే మాత్రం కరోనాను ఎదుర్కోవడం సాధ్యమయ్యే పని కాదని స్వయానా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పడమే దీనికి నిదర్శనం. బురారీ ప్రాంతంలో 450 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన కేజ్రీవాల్ కరోనాపై పోరుపై ఆనందం వ్యక్తం చేశారు.