iDreamPost
iDreamPost
రాష్ట్రానికి ఈ చివర ఒడిశాకు ఆనుకొని ఉన్న ఇచ్ఛాపురం అంటే వైఎస్ కుటుంబానికి ఎంతో అభిమానం. ఆ కుటుంబానికి చెందిన మూడు అద్భుతమైన ఘట్టాలకు ఆ పట్టణమే వేదికగా నిలిచింది. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2003లో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర ఇక్కడే ముగిసింది. ఇక్కడి నుంచే విజయ శంఖారావం పూరించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఆయన తదనంతరం వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర కూడా ఇక్కడే ముగిసింది.
ఇక వైఎస్ తనయుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నభూతో అన్న రీతిలో నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర ముగింపు ఘట్టానికి ఇదే పట్టణం మహోజ్వల వేదికై.. ఆయనకు అధికార మార్గం చూపింది. ఆ మూడు ఘట్టాల సాక్షిగా ఇటీవలి నామినేటెడ్ పదవుల నియామకాల్లో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ముచ్చటగా మూడు పదవులు ఇవ్వడం ద్వారా జగన్ తన అభిమానాన్ని చాటుకున్నారు. వీటిలో రెండు రాష్ట్రస్థాయి పదవులు కావడం విశేషం. ఆరునెలల క్రితం 56 బీసీ కులాలకు కార్పొరేషన్లకు నియామకాల సందర్భంలోనూ.. ఈ నియోజకవర్గానికి చెందిన దక్కత లోకేశ్వరరెడ్డిని రెడ్డిక కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమించారు. దాంతో కలుపుకొంటే.. ఇచ్ఛాపురం నియోజకవర్గానికి నాలుగు పదవులు లభించినట్లు అయ్యింది. ఉత్తరాంధ్రలో మరే నియోజకవర్గానికీ ఇన్ని పదవులు లభించకపోవడం విశేషం.
గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషనుకు నర్తు
నియోజకవర్గ సీనియర్ నేత, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న నర్తు రామారావు ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. మొదట కాంగ్రెసులో వైఎస్ అనుచరుడిగా ఉన్న రామారావు 2009లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి పలు పదవులు నిర్వహించారు. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న యాదవ సామాజిక వర్గ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్సార్సీపీ పటిష్టానికి కృషి చేశారు. 2019 ఎన్నికల్లో రాజకీయ సమీకరణాల కారణంగా రామారావుకు పోటీ చేసే అవకాశం లభించలేదు. పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా గుర్తింపు ఇస్తామని అప్పట్లోనే జగన్ హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి తాజా నియామకాల్లో నర్తుకు రాష్ట్రస్థాయి పదవి ఇచ్చారు.
ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ పదవికి ‘సాడి’
నియోజకవర్గానికి చెందిన మరో నేత సాడి శ్యాంప్రసాద్ రెడ్డిని కీలకమైన ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి వరించింది. పట్టణంలో ప్రముఖ వైద్యుడు డాక్టర్ త్రినాథ్ రెడ్డి అల్లుడైన ఆయన పీజీ, ఎంబీఏ చేశారు. ఉన్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టి వైఎస్సార్సీపీలో చేరారు. 2014 ఎన్నికల అనంతరం చాన్నాళ్లు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు సొంత డబ్బులతో కార్యక్రమాలు నిర్వహించారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా లభించలేదు. అయినా నిరాశ పడకుండా పార్టీ వెన్నంటే ఉంటూ చురుగ్గా వ్యవహరిస్తున్నారు. దానికి గుర్తింపుగా వైఎస్సార్సీపీ అతనికి రాష్ట్రస్థాయి పదవి ఇచ్చింది.
సుగుణకు డీసీఎంఎస్ పగ్గాలు
ఇక మహిళల కోటాలో నియోజకవర్గంలోని సన్యాసిపుట్టుగ గ్రామానికి చెందిన నాయకురాలు సల్ల సుగుణను జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్పర్సన్ గా నియమించారు. ఇంతకు ముందు ఈ పదవిని ఇదే నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజు నిర్వహించారు. పదవీకాలం పూర్తి కావడంతో ఆయన స్థానంలో సుగుణకు అవకాశం ఇచ్చారు. ఈమె భర్త దేవరాజు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచీ ఉన్న ఈ కుటుంబాన్ని పార్టీ ఈ విధంగా గుర్తించింది.