iDreamPost
iDreamPost
హుజురాబాద్ ఉప ఎన్నికలో హోరాహోరీ పోరు జరుగుతోంది. రంగంలో 30 మంది అభ్యర్థులు ఉన్నా ప్రధాన పోటీ అధికార టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెసుల మధ్య జరుగుతోంది. మరీ ముఖ్యంగా టీఆర్ ఎస్, బీజేపీల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ ఉంది. దాంతో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదన్న పట్టుదలతో రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తున్నారు. అభ్యర్థుల జాతకాలు తారుమారు కావడానికి ఒక్క ఓటు చాలు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాన పార్టీలు పనిచేస్తున్నాయి. అయితే ఒక విషయంలో టీఆర్ ఎస్, బీజేపీలు టెన్షన్ పడుతున్నాయి. అదే ఎన్నికల గుర్తుల సమస్య. ఈ రెండు పార్టీల గుర్తుల్లాగే కనిపించే వేరే గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడమే వారి ఆందోళనకు కారణం. గతంలో ఈ గుర్తుల కారణంగానే రెండు చోట్ల టీఆరెస్ అభ్యర్థులు గెలుపు ముంగిట చతికిలపడిన చేదు అనుభవం వారిని భయపెడుతోంది.
గతంలో ఏం జరిగింది?
2019లో జరిగిన లోకసభ ఎన్నికల్లోనూ, గత ఏడాది జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ టీఆరెస్ విజయావకాశాలను గుర్తులే దెబ్బ తీశాయి. నల్గొండ పార్లమెంటు స్థానంలో టీఆర్ ఎస్ అభ్యర్థి బూరె నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో 5వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అదే ఎన్నికల్లో పోటీ చేసిన ఒక స్వతంత్ర అభ్యర్థికి 27వేలకు పైగా ఓట్లు లభించాయి. ఆ అభ్యర్థి టీఆరెస్ కు చెందిన కారు గుర్తులాగే కనిపించే రోడ్డు రోలర్ గుర్తును ఆయనకు కేటాయించడం తమ అభ్యర్థి ఓట్లకు గండి కొట్టిందని అప్పట్లో అధికార పార్టీ నేతలు వాపోయారు. ఇక దుబ్బాక ఉప ఎన్నికలో టీఆరెస్ 1079 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కానీ ఆ ఎన్నికలో చపాతీ రోలర్ గుర్తుతో పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థికి 3570 ఓట్లు లభించడం గమనార్హం. చపాతీ రోలర్ కూడా ఈవీఎంలో కారులాగే కనిపిస్తుంది. వీటితోపాటు కారులాగే కనిపించే మరికొన్ని గుర్తులను ఎన్నికల్లో ఎవరికీ కేటాయించవద్దని గతంలోనే టీఆరెస్ ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు కొన్ని గుర్తులను తొలగించినా రోడ్డు రోలర్, చపాతీ రోలర్ గుర్తులను కొనసాగించడమే కాకుండా ప్రస్తుత ఉప ఎన్నికల్లో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో టీఆరెస్ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది.
బీజేపీది మరో సమస్య
ఉప ఎన్నికలో టీఆరెస్ ను సవాల్ చేస్తున్న బీజేపీ గుర్తుతోపాటు మరో సమస్యతో ఇబ్బంది పడుతోంది. నామినేషన్ల సమయంలో ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేరుతోనే ఆయనతో సహా నలుగురు నామినేషన్లు వేశారు. వారి ఇంటి పేర్లు కూడా దాదాపు అలాగే ఉండటంతో బీజేపీ కలవరపాటుకు గురయింది. అయితే పరిశీలనలోనే ముగ్గురు రాజేందర్ల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో ఆ టెన్షన్ తప్పినా.. ఇప్పుడు గుర్తుల సమస్య వెంటాడుతోంది. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం. దాదాపు అలాగే కనిపించే కాలీఫ్లవర్ గుర్తును ఈ ఉప ఎన్నికలో ఇండిపెండెంట్ అభ్యర్థికి కేటాయించడం బీజేపీ శ్రేణులను ఇబ్బంది పెడుతోంది. దీనికితోడు హుజురాబాదులో ఈటల అంటే కారు గుర్తు అనే ఇక్కడి ఓటర్లకు కొన్ని దశాబ్దాలుగా తెలుసు. అది వారి మైండ్ లో ముద్ర పడిపోయింది. కానీ ఈసారి ఈటల పార్టీ మారారు. ఆయన గుర్తు కూడా మారింది. ఈటల కమలం గుర్తుపై పోటీ చేస్తున్న విషయాన్ని ఓటర్ల మనసుల్లో నాటుకుపోయేలా చేయడానికే వారి చాలా శ్రమించాల్సి వస్తోంది.
Also Read : Huzurabad-Badvel ByPoll : నామినేషన్ల ఉపసంహరణ పర్వం ముగిసింది.. బరిలో భారీగా అభ్యర్థులు