iDreamPost
android-app
ios-app

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో నియామకాలు

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో నియామకాలు

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ కోసం భారీ ఎత్తున నియామకాలు చేపట్టారు. రాష్ట్రంలో వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నడిచే ఇన్స్టిట్యూషన్స్ కోసం ఉద్యోగాల భర్తీకి ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పెద్ద మొత్తంలో వైద్య ఆరోగ్య శాఖలో అదనంగా కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఇన్స్టిట్యూషన్స్ లో 2588 కొత్త పోస్టులు సృష్టిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో పాటు కొత్తగా సృష్టించిన పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా మంజూరైన పోస్టుల వివరాలు చూస్తే.. డాక్టర్ లు- 455, నర్సింగ్ -60, పారామెడికల్ -644 వంటి విధంగా ఇతర విభాగాలకు సంబంధించిన పోస్టులున్నాయి.

వైద్య, ఆరోగ్య శాఖలో డాక్టర్లు, సిబ్బంది సహా పెద్ద ఎత్తున నియామకాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల మొదట్లో జరిగిన సమీక్ష సమావేశంలో స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖలో 39 వేల మందిని నియమిస్తున్నామని, ఇందులో ఇప్పటి వరకు 27 వేల మందిని రిక్రూట్‌ చేశాము అని జగన్ పేర్కొన్నారు. మిగిలిన వారిని ఈ నెలాఖరులోగా నియమించాలని ఆదేశించారు. ఆయన చెప్పిన కొద్ది రోజులకి వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.