Idream media
Idream media
నిబంధనల ప్రకారం 6 నెలల్లో కనీసం ఒకసారి పార్లమెంటు సమావేశం జరగాలి. కేంద్ర బడ్జెట్ సమావేశాలను కరోనా నేపథ్యంలో అర్ధాంతరంగా మార్చి 23న ముగించారు. నాటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరగలేదు. నిబంధనల మేరకు ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ లో పార్లమెంట్ ను సమావేశ పరచాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యమా…? అంటే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న రెండు నెలలూ మహమ్మారి మరింత ఉధృతం అవుతుందని.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిస్తోంది. ఈ పరిస్థితుల్లో సమావేశాల నిర్వహణపై కేంద్రం సందిగ్ధంలో పడ్డట్లు తెలిసింది.
2 వారాలు.. వారానికి మూడు రోజులు…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణపై కేంద్రం గత నెలలోనే కసరత్తు ప్రారంభించింది. 2 వారాల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు చివరి నుంచి సెప్టెంబర్ మొదటి వారం వరకూ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటేసింది. రానున్న రోజుల్లో రోజుకు లక్ష చొప్పున నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన ప్రకారం సమావేశాల నిర్వహణ మంచిది కాదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే సోమ, బుధ, గురువారం మాత్రమే సమావేశాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. మిగతా రోజుల్లొ పార్లమెంట్ ను శానిటైజ్ చేయించే ఆలోచన చేస్తున్నారు.
భౌతిక దూరం పాటించేలా..
ఒకవేళ సమావేశాలు నిర్వహిస్తే.. నిబంధనలు పాటిస్తూ ఎక్కడ నిర్వహించాలనే దానిపై కూడా ప్రశ్నలు తలెత్తాయి. దీనిపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మధ్య చర్చ జరిగింది. ప్రత్యామ్నాయ వేదికలుగా పార్లమెంటు సెంట్రల్ హాల్ లేదా విజ్ఞాన్ భవన్ ను పరిశీలించాలని అధికారులకు వారు సూచించారు. పార్లమెంటులోనే సమావేశాలు నిర్వహిస్తే ఎంపీలు భౌతికదూరం పాటించడానికి వీలుగా లోక్‌సభ సమావేశాలను సెంట్రల్ హాల్లో, రాజ్యసభ సమావేశాలను లోక్‌సభ హాల్ లో నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది. దీని వల్ల రెండు సమావేశాలూ ఒకేరోజు జరుగుతాయని భావిస్తున్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఎంపీలు హాజరయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. దీంతో రాలేని వారు వర్చువల్ గా హాజరయ్యే అవకాశం కల్పించే కల్పించే అవకావాలు పరిశీలిస్తున్నారు.