iDreamPost
android-app
ios-app

పునాది మర్చిపోతే ఎలా పూజా

  • Published Nov 07, 2020 | 12:33 PM Updated Updated Nov 07, 2020 | 12:33 PM
పునాది మర్చిపోతే ఎలా పూజా

నిన్న ఓ బాలీవుడ్ వెబ్ సైట్ కు ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో హీరోయిన్ పూజా హెగ్డే సౌత్ సినిమా ఆడియన్స్ మేకర్స్ గురించి చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపాయి. గతంలో ఓసారి రాఘవేంద్రరావు టేకింగ్ గురించి తాప్సి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తరహాలో ఇవి కూడా ఉండటంతో అభిమానులు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి ప్రేక్షకులు దర్శకులు ఎక్కువ నడుమందాల మీదే దృష్టి పెడతారని, పొట్టి దుస్తుల్లోనే చూపించేందుకు ఇష్టపడతారని అర్థం వచ్చేలా మాట్లాడ్డంతో ఇది కాస్తా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వివిధ రకాల పోస్టుల్లో తనకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.

హిందీ సినిమాల మోజులో పడిపోయిన పూజా హెగ్డే ఇన్ని కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకోవడానికి పునాది వేసింది తెలుగు పరిశ్రమే అని మర్చిపోకూడదు. ఫస్ట్ మూవీ ముకుందాలో శ్రీకాంత్ అడ్డాల ఇచ్చినంత అందమైన కథానాయిక పాత్ర ఎవరైనా బాలీవుడ్ దర్శకుడు ఆఫర్ చేశారా. అంతెందుకు హృతిక్ రోషన్ తో ఆడిపాడిన మొహంజోదారోలో అసలు బోల్డ్ సీన్లే లేవా. గుంపులో గోవిందాలాగా హౌస్ ఫుల్ 4లో చేసిన ఉదాత్తమైన పాత్ర గురించి కూడా పూజా వివరణ ఇస్తే బాగుంటుంది. చేయబోయే సర్కస్ లో కూడా నిండైన దుస్తులు వేసుకుంటానని హామీ ఇస్తుందేమో వేచి చూడాలి. అసలు హరీష్ శంకర్ డిజెలో తనను అలా చూపకపోతే అసలిప్పుడు పూజా హెగ్డే అనే పేరే వినిపించేది కాదు.

ఇదంతా మర్చిపోయి సౌత్ సినిమాని ఇలా అవహేళన చేయడం పూజా హెగ్డేకు తగదు. ఇప్పటికీ మన స్టార్లు పిలిచి మరీ అవకాశాలు ఇస్తున్నారంటే కారణం తనేదో గొప్ప నటీమణి అనో లేదా ఆమె లేకపోతే సినిమాలు ఆడవనో కాదు. మేకర్స్ కు ఆప్షన్స్ తగ్గిపోయాయి కాబట్టి తనకు ఆఫర్లు ఎక్కువయ్యాయి. ఒకవేళ ప్రతిఘటన, మౌనపోరాటం, కర్తవ్యం లాంటి సినిమాలు ఇస్తే ఏ మాత్రం చేస్తుందో ఊహించడం కష్టమేమి కాదు. అంతదాకా ఎందుకు అరుంధతి లాంటి ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీతో కోట్లాది రూపాయలు వసూళ్లు వచ్చేలా చేసిన అనుష్కనే ఇలా పొరపాటున కూడా నోరు జారిన దాఖలాలు లేవు. కానీ పూజా హెగ్డే మాత్రం కూర్చున్న కొమ్మను నరుక్కుని హిందీ సినిమాలనే ఆకును పట్టుకోవడానికి తపిస్తోంది కాబోలు. ఇంత వ్యతిరేకత వచ్చినా పూజా ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం.