ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నవరత్నాలలో భాగమైన పేదలందరికీ ఇళ్ల పథకానికి హైకోర్టు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఇస్తున్న స్థలం సరిపోదని కోర్టు వ్యాఖ్యలు చేయడమే కాక ఈ విషయంలో ఒక స్పెషల్ కమిటీ వేసి అధ్యయనం చేయించాలని కూడా సూచించింది.. కమిటీ నివేదిక వచ్చే వరకు నిర్మాణాలు చేపట్టవద్దని కోరింది. తాజాగా ఈ విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పేదలందరికీ ఇల్లు కట్టించాలని బలమైన కోరికతో ఉన్న తమ ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద దెబ్బ లాంటిదని ఆయన అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా లక్షలాది పేద కుటుంబాల ఆశలు ఒక్కసారిగా ఆవిరయ్యాయి అని ఒక రకంగా కోర్టును తప్పుదారి పట్టించే విధంగా పిటిషన్ వేశారని అన్నారు.
ఇక తెనాలికి చెందిన సుమారు 129 మంది జాయింట్ పిటిషన్ వేశారని ప్రచారం జరుగుతుండగా పిటిషనర్లు గా పేర్కొనబడుతున్న వారు అసలు తమకు పిటిషన్ ఎలా వేయాలో కూడా తెలియదని, మాకు స్థలం ఇస్తే మేమెందుకు దాన్ని మేమే ఎందుకు ఆపుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేయడం కోసం టీడీపీ నేతలు కొందరిని అడ్డం పెట్టుకున్నారు అని వెల్లడించారు. న్యాయ స్థానాలను టీడీపీ నేతలు రాజకీయ వేదికలుగా వాడుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కోర్టులో పిటిషన్ వేసి నిర్మాణం ఆపాలని కోరడం వెనుక టీడీపీ పాత్ర ఉందని ఆరోపించిన సజ్జల రామకృష్ణారెడ్డి మునుపెన్నడూ లేని విధంగా లబ్ధిదారులకు ఓనర్ షిప్ ఇచ్చే విధంగా పట్టాలు పంపిణీ చేస్తున్నామని అన్నారు. డి పట్టాలు అసైన్డ్ పట్టాలు ఇచ్చి ఇబ్బందులు పెట్టడం కంటే ఓనర్ షిప్ ఇచ్చేలా పట్టాలు పంపిణీ చేస్తే భరోసా ఉంటుందని ప్రభుత్వం భావించింది అని చెప్పుకొచ్చారు.
పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్న సజ్జల ఈ విషయంలో డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపట్టిందన్న సజ్జల అగ్ని ప్రమాదాలు జరిగితే పిచ్చుక గూళ్లలా కట్టిన టిడ్కో ఇళ్లలో జరుగుతాయా? లేక నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ప్రకారం కట్టిన వాటిలో జరుగుతాయా అని ప్రశ్నించారు. అసలు టిడ్కో ఇల్లు మనుషులు ఉండటానికి పనికొస్తాయా? అని ప్రశ్నించిన ఆయన ప్రమాదాలు జరిగితే వృద్ధులు,పెద్ద వారు ఉంటే టిడ్కో ఇళ్ల నుంచి ఎలా బయటకు వస్తారని అన్నారు. తాము ఇస్తున్న ఇళ్ల గురించి కోర్టుకు వెళ్లే ముందు టిడ్కో ఇళ్ల గురించి కూడా టీడీపీ నేతలు ప్రస్తావించాలని అన్నారు. కేవలం 215 చదరపు అడుగుల్లో చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టారని అన్నారు. అయితే మొత్తం మీద అసలు పిటిషనర్లకే తెలియకుండా పిటిషన్లు దాఖలు చేసిన అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.