కరోనా భయాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజల నుండి లక్షలు దండుకుంటున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్నిసార్లు హెచ్చరించినా కొన్ని హాస్పిటళ్ల తీరు మారడం లేదు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న హాస్పిటళ్లను సీజ్ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినా సరే కొన్ని హాస్పిటళ్లు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతున్నాయి. అలా ప్రజల నుండి లక్షలు దండుకుంటుందన్న ఆరోపణలు రావడంతో ఏపీ ప్రభుత్వం ఒక హాస్పిటల్ ను సీజ్ చేయడం సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కరోనా బాధితుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితుల నుండి ఫిర్యాదులు అందడంతో వైద్యారోగ్య శాఖాధికారులు ఆకస్మికంగా మురళీకృష్ణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో తమకు అందిన ఫిర్యాదులు నిజమని తేలడంతో హాస్పిటల్ ను సీజ్ చేసారు.
కరోనా భయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసే హాస్పిటళ్లను సీజ్ చేస్తామని.. నిబంధనలు తుంగలో తొక్కి అధిక ఫీజులను బాధితుల నుండి వసూలు చేస్తే ప్రభుత్వం సహించదని అలాంటి హాస్పిటళ్లను గుర్తించి సీజ్ చేస్తామని అధికారులు వెల్లడించారు.