iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు తెరలేపిన నిర్ణయాలతో జగన్ ప్రభుత్వం ముందుకెళుతుంది. అదే పరంపరలో ప్రజా రక్షణ కోసం, ఆరోగ్య అవసరాలు తీర్చడం కోసం సిద్ధం చేసిన వాహనాలను జనం ముందుకు తీసుకువచ్చింది. ఒకేసారి వెయ్యికి పైగా వాహనాలను రాష్ట్రమంతా తరలించడం ద్వారా కొత్త అధ్యాయం సృష్టించింది. సీఎం జగన్ జెండా ఊపి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక జనాలకు అందుబాటులో ఉండేందుకు అనుగుణంగా బయలుదేరాయి.
వైఎస్సార్ ప్రభుత్వ హయంలో పురుడుపోసుకున్న 108 అంబులెన్స్ లు వేల మంది ప్రాణాలు కాపాడాయి. కుయ్..కుయ్ మంటూ అవి కదులుతుంటే ఆ మాజీ ముఖ్యమంత్రి అందరి మెదిలో మెదిలేటంత స్థాయిలో కనిపించాయి. కానీ ఆ తర్వాత క్రమంగా వాటి ప్రస్థానంలో చీకటి అలముకుంది. ఫోన్ చేసిన నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరకున్న స్థితి నుంచి గంట పాటు వేచి చూసినా అంబులెన్స్ అందుబాటులోకి రాని దుస్థితికి చేరింది. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా ముక్కుతూ, మూలుగుతూ వెళ్లే 108 వాహనాల్లో ఊపిరి నిలిపే పరిస్థితి లేకపోవడంతో ప్రజా విశ్వాసం సన్నగిల్లింది. ఒకనాడు ఎటువంటి ముప్పు వచ్చినా 108 ఉందనే ధీమాతో కనిపించిన జనమే మళ్లీ ఎవరి దయాదాక్షిణ్యాలకు వారే అన్నట్టుగా మారాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితిని సరిదిద్దే దిశగానే వైఎస్ జగన్ కీలక అడుగు వేశారు. మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు తగ్గట్టుగా కొత్త వాహనాలను కొనుగోలు చేశారు. 108తో పాటుగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం మనుగడలోకి వచ్చిన 104 వాహనాలను కూడా ఆధునీకరించారు. అవసరమైన సదుపాయాలు అమర్చారు.
Also Read:వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రంగా ఏపీ..
ఏకకాలంలో 1088 వాహనాలను సన్నద్ధం చేసి రోడ్డు మీదకు తీసుకొచ్చారు. 108 వాహనాలలో అడ్వాన్సుడు లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తో సిద్ధం చేసి అందుబాటులోకి తీసుకురావడం గమనిస్తే ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతనిస్తుందో చెప్పకనే చెప్పేశారు. ఊపిరి నిలిపి వాహనాల్లో పునరుత్తేజం నింపారు. మళ్లీ ప్రజల్లో 108 పట్ల విశ్వాసం పెంచేందుకు అనుగుణంగా వాహనాలను పరుగులు పెట్టించేందుకు సిద్ధమయ్యారు. నిర్దిష్ట సమయంలో వాహనాలు చేరేందుకు తగ్గట్టుగా పట్టణాలు, గ్రామాలు, ఏజన్సీ ప్రాంతాలకు తగ్గట్టుగా కాల పరిమితిని నిర్దేశించడం విశేషం. ఇక చిన్నారులకోసం నియోనేటల్ అంబులెన్స్ కూడా అందుబాటులోకి రావడం దేశంలోనే తొలిసారిగా తీసుకున్న నిర్ణయం.
కొంతకాలంగా పాత వాహనాలతో కుస్తీ పడుతున్న సిబ్బందికి ఊరట కల్పించేలా నయా రూపంలో రాష్ట్రమంతా కదిలిని 108 వాహనాల ద్వారా పూర్వ స్థితి ఖాయమని అంతా భావిస్తున్నారు. తద్వారా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రకంగా మారబోతున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే అనేక మంది విమర్శకులు సైతం ఈ విషయంలో జగన్ ప్రభుత్వ చొరవను అభినందిస్తున్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా వైద్య సేవల విషయంలో ప్రభుత్వ చొరవను ప్రశంసిస్తున్నారు. దేశమంతా ఆదర్శంగా తీసుకునే స్థాయిలో జగన్ ప్రభుత్వం కొత్త హంగులతో పరుగులు పెట్టిస్తున్న ప్రాణ రక్షక వాహనాలను చూసి ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.