తెలుగోడి రాజసానికి ప్రతీకగా నిలిచే రాచరికపు కాలపునాటి కోటల్లో కొండపల్లి కోట ఒకటి. ఎన్నో యుద్ధాలకు సాక్షిగా నిలిచింది. రెడ్డిరాజులు రాజసాన్ని చూసిన ఈ మహాదుర్గం.. గజపతుల శౌర్యాన్ని పరీక్షించింది. అనంతరం విజయనగరపు సామాజ్ర్య అధినేత కృష్ణదేవరాయుడి పోరాటపటిమకు పరీక్ష పెట్టిన ఈ శత్రు దుర్బేద్యపు రాజప్రసాదం.. అనంతరం కాలంలో వలసపాలకులకు వశమై సాయుధ సైన్యశిక్షణా కేంద్రంగా కొనసాగింది. ఆలనాటి రాజుల వైభవానికి, రాజసానికి సజీవ సాక్ష్యంగా ఉన్న కోండపల్లి కోట గురించి తెలుసుకుందాం.
దక్షిణాది ప్రవేశ ధ్వారం..
రెడ్డిరాజుల కాలంలో ఓ వెలుగు వెలిగింది ఈ మహాదుర్గం. దక్షిణాది నుంచి వ్యాపారులకు ఎంట్రీ పాయింట్ గా ఉన్న కొండపల్లి కోటను శత్రు దుర్భేద్యంగా నిర్మించారు. కొండపల్లి దాని పరిసర ప్రాంతాలు చాళుక్యులు, కాకతీయులు ఆధీనంలో ఉన్నప్పటీకీ కోట నిర్మాణం మాత్రం 13 వ శతాబ్ధంలోనే జరిగింది. కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించిన సమయంలో ఈ దుర్గాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
Also Read : పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?
అభేద్యమైన కోటను కొండవీటిరెడ్డి రాజు ప్రోలాయ వేమారెడ్డి 1350లో నిర్మించారు. కృష్ణా నదికి ఓ వైపు కొండవీటి కోట కాగా,,రెండో వైపు కొండపల్లి కోట.. రాత్రి సమయంలో వీరు దివిటీల కోడ్ భాషలో కమ్యూనికేషన్ చేసుకునేవారని ఓ ప్రచారం ఉంది. కొండవీటి రెడ్డి రాజుల తర్వాత కొండపల్లి కోట ఒరిస్సా గజపతులు వశమైంది. తర్వాత 1463-82 మధ్య కాలంలో బహమని రెండో మహ్మద్ షా గజపతులను ఓడించి కొండపల్లి ఖిల్లాను ఆక్రమించారు. కొండపల్లి కోట. మూడు వరుసల గోడులు, రాణిమహల్, జైలు, రాజదర్బార్ లు అప్పటి సివిల్ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. అబ్బుర పరిచే నిర్మాణశైలికి తోడు దట్టమైన అడవిలో ప్రకృతి రమణీయత మధ్య ఇప్పటికీ సందర్శకులను ఆకట్టుకుట్టుంది.
గ్రామ నిర్మాణం కోసం నరబలి…?
కొండ కింది భాగంలో ఓ గ్రామం నిర్మించాలని భావించగా.. గ్రామ నిర్మాణం ముందుకు సాగలేదు. దీంతో కొండడు అనే యాచకుడితో పాటు పల్లె అని అతని భార్యను బలి ఇచ్చినట్లు చెబుతారు. అందుకే కొండపల్లి అనిపేరు వచ్చినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది.
Also Read : భారత్ లో కలవని బనగానపల్లె
రహస్య మార్గం…
కొండమీదకు వెళ్లేందుకు పూర్వం రెండుదారులు ఉండేవి. ఒకటి రాజబాట కాగా, రెండోది రహస్య మార్గం. అయితే కొండపల్లి కోట నుంచి అగిరిపల్లి వరకు సొరంగ మార్గం కూడా ఉందని చెబుతుంటారు. కొండపైకి వెళ్తే సింహ ద్వారం, దానిని దాటగానే రాజసౌధాలు, సైనికులు నివసించే గృహాలు, జైలు, గజశాల, అశ్వశాల, నర్తనశాల, మార్కెట్, పార్క్ కనిపిస్తాయి. రాజభవనాల వెనుక కోనేరు ఉంటుంది. కోటను శత్రువుల నుంచి రక్షించడానికి నలు దిక్కులా ఎత్తైన, గట్టి బురుజులు నిర్మించారు. నేలమట్టం నుంచి 700 గజాల ఎత్తులో ఉండి చాలా కీలకమైనదిగా చెబుతారు. 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు సైన్యాన్ని కూడా ఇక్కడి నుంచే కనిపెట్టి రణభేరి మోగించేవారు. కోటలో ఎప్పుడూ 10వేల సాయుధులు ఉండేవారని చరిత్ర చెబుతోంది.
తిమ్మరుసు భావి…
గజపతుల నుంచి ఈ కోటను విజయనగర సామ్రాజ్య అధినేత శ్రీకృష్ణ దేవరాయులు ఆక్రమించారు. 1516లో కోటను ముట్టడించగా తమ ఆధీనంలోకి తీసుకురావడానికి కొన్ని నెలలు సమయం పట్టింది. అప్పటి విజయనగర సైన్యానికి తాగునీరు దొరకకపోవడంతో వారి కోసం మంత్రి తిమ్మరుసు ఇబ్రహీంపట్నం మెయిన్ రోడ్డు పక్కన బావి తవ్వించారు. ఇప్పటికీ ఈ బావిని తిమ్మరుసు బావి అని పిలుస్తారు. కొండపల్లిలో లభించిన శాసనం కారణంగానే కృష్ణదేవరాయులు 1530లో మృతి చెందినట్లు తెలుస్తోంది.
Also Read : తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?
కోట నుంచి ఖిల్లా..
శ్రీకృష్ణ దేవరాయులు తర్వాత ఈ కోటను గోల్కండ పాలకులైన కులీకుతుబ్ షా లు ఆక్రమించుకున్నారు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కూడా ఇక్కడి నుంచే పాలనసాగించారని .. ఆయన పేరుమీదే ఇబ్రహీంపట్నం ఏర్పడిందని చెబుతారు. 1766 మార్చిలో జనరల్ క్లైవ్ లాయిడ్ ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. 1859 వరకు ఈ కోట సాయుధ శిక్షణ కేంద్రంగా ఉండేది. ఆర్థిక సమస్యలతో తర్వాత మూతపడింది. 1962లో ఈ కోట రాష్ట్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలోకి వచ్చింది. అప్పటి నుంచి రక్షిత కట్టడంగా ప్రకటించారు.
హైదరాబాద్ లోని గోల్కండ కోటలా దీనిని కూడా అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వాలు సంకల్పించాయి. అందుకు అనుగుణంగా కొంతమేరకు నిధులు కూడా కేటాయించాయి. 2002లో 8.5లక్షలు కేటాయించగా.. 2004లో అప్పటి ప్రభుత్వం, కోట మరమ్మతుల కోసం 62లక్షలు కేటాయించింది. 2016లో 10.90కోట్ల రూపాయలు కేటాయించగా.. 2019లో రెండురోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించారు. ప్రస్తుతం టూరిస్ట్ స్పాట్ గా ఉన్న కొండపల్లి కోటకు వారంతంలో ఎక్కువ మంది సందర్శకులు వస్తున్నారు.
Also Read : కాటమరాజు ఏలిన మా కనిగిరి చరిత్ర తెలుసా..?