iDreamPost
iDreamPost
ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు షష్టిపూర్తి వయసులోనూ వాళ్ళ పక్కన సినిమాల్లో ఆడిపాడేందుకు శ్రీదేవి లాంటి టీనేజ్ అమ్మాయిలు కూడా ఉత్సాహం చూపేవాళ్లు. కొత్త జెనరేషన్ హీరోలతో చేస్తున్నా సరే పెద్దవాళ్ళకు జోడిగా ఎందుకులే కనిపించడం అనే ఫీలింగ్ ఉండేది కాదు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కాంబినేషన్లను విపరీతంగా ఆదరించేవారు. దానికి మంచి ఉదాహరణలుగా అడవిరాముడు, ప్రేమాభిషేకం లాంటివి చెప్పుకోవచ్చు. బడిపంతులులో మనవరాలిగా నటించిన శ్రీదేవినే వేటగాడులో ఆకు చాటు పిందె తడిసెలో తారకరాముడి పక్కన వర్షం సాంగ్ లో దుమ్ము రేపింది. ఇదంతా గత చరిత్ర. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
ఇప్పుడు అరవై వయసు దాటిన సీనియర్లకు హీరోయిన్ ని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్ గా మారింది. డిమాండ్ ఉన్న ప్రెజెంట్ జెనరేషన్ ముద్దుగుమ్మలు ఎంత రెమ్యునెరేషన్ ఇచ్చినా నో చెబుతున్నారు. అందుకే బాలయ్య బోయపాటి సినిమా కోసం మలయాళం నుంచి ప్రయాగ మార్టిన్ ని, వెబ్ సిరీస్ లు చేసుకుంటున్న పాత హీరోయిన్ పూర్ణను తీసుకోవాల్సి వచ్చింది. వెంకటేష్ నారప్ప కోసం ప్రియమణి తప్ప ఎవరూ దొరకలేదు. నాగార్జున వైల్డ్ డాగ్ సబ్జెక్టు పరంగా రొమాంటివ్ యాంగిల్ లేదు కాబట్టి ఏదో మమ అనిపించారు. చిరంజీవి వేదాళం, లూసిఫర్ రీమేకులకు సైతం ఇదో పెద్ద సమస్యగా మారడం ఖాయం. ఆచార్యకు ఎవరూ దొరక్కే మళ్ళీ కాజల్ అగర్వాల్ నే ఒప్పించుకున్నారు.
దీనికి పరిష్కారం లేదా అంటే రాజీ సూత్రం తప్ప మరొకటి లేదు. సీనియర్లతో చేస్తే కొత్త తరం స్టార్లు తమకు ప్రాధాన్యం ఇవ్వరన్న భయం హీరోయిన్లలో ఉంది. అందుకే పెద్ద హీరోలు వాళ్ళ వయసుకు తగ్గట్టు ఎవరినో ఒకరిని జోడిగా సెట్ చేసి షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక్కడితో పోలిస్తే తమిళనాడులో కొంచెం నయం. రజనీకాంత్ అంటే చాలు ఎవరైనా చేసేందుకు ముందుకు వస్తున్నారు. హిందీలోనూ సల్మాన్ ఖాన్ లాంటి హాఫ్ సెంచరీ హీరోలకూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదు. ఎటొచ్చి టాలీవుడ్ లోనే ఇదో పెద్ద చిక్కులా మారిపోయింది. చూస్తుంటే ఇకపై కథలు కూడా అమితాబ్ బచ్చన్ తరహాలో వయసుకు తగ్గట్టు ఎంచుకోకతప్పేలా లేదు.