ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో న్యాయవ్యవస్థ కేంద్ర స్థానం అయ్యింది. గత కొన్ని నెలలుగా ఏపీ హైకోర్ట్ వెలువరిస్తున్న తీర్పులపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. పార్లమెంట్ సాక్షిగా వైఎస్సార్సీపీ ఎంపీలు ఘాటుగా స్పందిస్తున్నారు. అదే సమయాన హైకోర్టులో పాలన చేయాల్సింది మేమా..వాళ్లా అంటూ సూటిగానే అడిషనల్ అడ్వొకేట్ జనరల్ సంధించిన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మొత్తంగా శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం శృతిమించిందనే వాదన బలపడుతోంది. పైగా గ్యాగ్ ఉత్తర్వుల పట్ల దేశమంతా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. దానికి తోడుగా టీడీపీ న్యాయవాదులుగా పనిచేసిన వాళ్లే న్యాయమూర్తులుగా మారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు విరుచుకుపడుతున్నారు.
అదే సమయంలో అపద్ధర్మ సీఎంగా ఉన్న కాలంలో చంద్రబాబు న్యాయమూర్తులకు కేటాయించిన ఇళ్ల స్థలాల అంశం వివాదంగా మారుతోంది. ఇప్పటికే ఆయా భూముల రిజిస్ట్రేషన్స్ కి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక రిటైర్డ్ జడ్జి సహా మొత్తం 13 మందికి భూములు కట్టబెట్టిన తీరు మీద పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఘటనలను గుర్తు చేసుకుంటున్నారు. ఏపీలో వివిధ తరగతులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన చివరి ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ఉన్నారు. ఆయన కాలంలోనే మీడియా కి సైతం రాష్ట్రంలోని అనేక నగరాల్లో ఇళ్ల స్థలాలు అందించారు. ఆతర్వాత ఒక్కరికి కూడా సెంటు స్థలం కూడా దక్కిన దాఖలాలు లేవు.
అలాంటి సమయంలోనే న్యాయమూర్తులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలని వైఎస్సార్ ప్రతిపాదించారు. సివిల్ సర్వీస్ అధికారులకు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు, ఇతర సిబ్బందికి, మీడియాతో పాటుగా న్యాయమూర్తులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు హైదరాబాద్ లో వైఎస్సార్ ప్రతిపాదించారు. కానీ నాటి హైకోర్ట్ న్యాయమూర్తులు దానిని తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి నేరుగా ప్రయోజనం పొందడం నైతికంగా తగిన పని కాదని అభిప్రాయపడ్డారు. దాంతో న్యాయమూర్తులు నిరాకరించడం, అప్పట్లో చుక్కా రామయ్య, కే నాగేశ్వర్ సహా నాటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కూడా ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి నిరాకరించడంతో మిగిలిన వారికి వైఎస్సార్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించింది.
ఇక ఆ తర్వాత పదేళ్లకు అంటే 2008లో జరిగిన దానికి భిన్నంగా 2019 ఏప్రిల్ లో చంద్రబాబు అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఇళ్ల స్థలాలు ఆఫర్ చేస్తే న్యాయమూర్తులు అంగీకరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతంలో న్యాయమూర్తులు నైతిక విలువల పేరుతో నేరుగా ప్రభుత్వ ప్రయోజనం పొందడానికి నిరాకరిస్తే ఇటీవల దానికి భిన్నంగా వ్యవహరించిన వైనం విస్మయకరంగా కనిపిస్తోంది. ఈసారి లబ్దిదారుల జాబితాలో ఓ రిటైర్డ్ జడ్జి ఉండడం మరో విచిత్రం. గతంలో ఓటుకు నోటీ కేసులో తీర్పు ఇచ్చిన జడ్జిని కూడా అమరావతిలో ఇళ్ల స్థలాల లబ్దిదారుల జాబితాలో ప్రస్తుత న్యాయమూర్తుల సరసన చేర్చడం ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఎకరంగా సుమారు రూ. 10 కోట్లు విలువ చేసే ప్రాంతంలో అంటే గజం సుమారుగా రూ. 20వేలు ఉంటుందని అంచనా. అలాంటి చోట ఒక్కొక్కరికీ 600గజాలు చొప్పున రూ. 5వేలకే చంద్రబాబు ప్రభుత్వం అందించినట్టు ప్రచారంలో ఉన్న పత్రాల ద్వారా తెలుస్తోంది.
దాంతో ఆనాటి న్యాయమూర్తుల తీరుకి, వర్తమాన వైఖరికి ఉన్న వైరుధ్యం ఇప్పుడు ఆసక్తికర అంశంగా మారింది. మారుతున్న పరిస్థితులు, ముఖ్యంగా న్యాయవ్యవస్థలో విలువల గురించి ఆందోళన పార్లమెంట్ లో కూడా వినిపిస్తున్న సమయంలో ఈ మార్పు చర్చకు దారితీస్తోంది.