iDreamPost
android-app
ios-app

రాజ‌కీయ రంగు పులుముకున్న హ‌త్రాస్ ఘ‌ట‌న‌

రాజ‌కీయ రంగు పులుముకున్న హ‌త్రాస్ ఘ‌ట‌న‌

ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జ‌రిగిన ఘ‌ట‌న రాజ‌కీయ రంగు పులుముకుంది. దీనికి సంబంధించి యూపీ సీఎం యోగి ఇప్ప‌టికే సిట్ ఏర్పాటు చేశారు. బాధితురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థికసాయం ప్ర‌క‌టించారు. దీంతో పాటు ఒక ఇల్లు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ప్ర‌ధాని మోదీ కూడా స్పందించారు. సీఎం యోగీతో ఫోన్లో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చూడాలని చెప్పారు. ఇదిలా ఉండ‌గా.. ఫోరెన్సిక్‌ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఈ నివేదిక వెల్లడించడం గమనార్హం. మ‌రోవైపు దీనిపై రాజ‌కీయ పార్టీల‌న్నీ రంగంలోకి దిగుతున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌డానికి రాహుల్, ప్రియాంక వెళ్ల‌గా.. అది ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. దీంతో నిర‌స‌న‌ల‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

విమ‌ర్శ‌నాస్త్రాలు

మ‌రోవైపు ఈ ఘ‌ట‌న రాజ‌కీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. బీజేపీ, ప్ర‌తిప‌క్ష పార్టీలు ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటాయి. హత్యాచారానికి దారి తీసిన పరిస్థితులు, అర్ధరాత్రి సమయంలో అంత్యక్రియలు జరిపించడంపై వివిధ ప్రతిపక్షపార్టీలు, వామపక్షాలు, కాంగ్రెస్‌ అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ వైఖరిపై ఢిల్లీలోని యూపీ భవన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. దీంతో వారిని పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే హ‌త్రాస్ ఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్నాయ‌ని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే ప్ర‌భుత్వం త‌గిన విధంగా స్పందించింద‌ని చెబుతున్నారు. ఈ ఘ‌ట‌నకు రాజ‌కీయ రంగు పులుముకోవ‌డంతో స‌ర్వ‌త్రా ఉద్రిక్త‌త‌కు దారి తీస్తోంది.

నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేస్తారా..?

ఉత్తరప్రదేశ్‌ హత్రాస్‌ ఘటనలో నిందితుల‌ను ఎన్ కౌంట‌ర్ చేస్తారా..? అనే వార్త‌లు ప్ర‌చారం జ‌రుగుతున్నాయి. దీనికి ఊతం ఇస్తూ బీజేపీ నాయ‌కుడి వ్యాఖ్య‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం. హ‌త్రాస్ ఘ‌ట‌న‌లో బాధితురాలికి సత్వర న్యాయం చేయాలని డిమాండ్ ఊపందుకుంటోంది. ఈ క్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా బుధవారం హత్రాస్‌ ఘటనపై మీడియాతో మాట్లాడుతూ.. ‘నిందితులను అరెస్ట్‌ చేశారు. కేసును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు అప్పగించారు. వారిని అరెస్ట్‌ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్‌ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రంలో ఒక కారు ఎప్పుడైనా బోల్తా పడగలదని నాకు తెలుసు’ అంటూ ఎన్‌కౌంటర్‌ జరిగే అవకాశం ఉందనే హింట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇందుకు తెలంగాణ లోని దిశ ఘ‌ట‌నను ఉదాహ‌ర‌ణంగా కొంద‌రు పేర్కొంటున్నారు.