క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా కోసం సూర్య మూవీస్ సంస్థ హర హర మహాదేవ్ అనే టైటిల్ ని రిజిస్టర్ చేయడం అభిమానులతో పాటు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గతంలో విరూపాక్ష టైటిల్ ని అనుకున్నప్పటికీ దాన్ని తర్వాత డ్రాప్ అయ్యారు. ఇంకో రెండు మూడు పేర్లు ప్రచారమయ్యాయి కానీ ఫైనల్ గా అందరూ హర హర మహాదేవ్ పట్లే పాజిటివ్ గా రెస్పాండ్ కావడంతో ఫైనల్ గా దీన్నే లాక్ చేశారని వినికిడి. ఆ కారణంగానే రిజిస్టర్ చేయించారనే వార్త కూడా వినిపిస్తోంది. అయితే అధికారికంగా ఇప్పట్లో ప్రకటించే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కారణం విడుదలకు ఇంకా చాలా టైం ఉండటమే.
అయితే ఈ టైటిల్ కు బాలయ్యకు లింక్ ఏమిటనుకుంటున్నారా. చాలా ఏళ్ళ క్రితం బెల్లంకొండ సురేష్ నిర్మాతగా బి గోపాల్ దర్శకత్వంలో ఇదే పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. మీడియాకు పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. అందులో దశావతారంలో కమల్ హాసన్ స్టిల్స్ ని మార్ఫింగ్ చేశారనే కామెంట్స్ గట్టిగా వినిపించాయి. తమన్ సంగీత దర్శకుడిగా పరుచూరి బ్రదర్స్ రచన చేస్తారని అందులో పేర్కొన్నారు. బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి దాన్నుంచి ఫ్యాన్స్ చాలా ఆశించారు. అయితే ఆ హర హర మహాదేవ్ కేవలం ప్రెస్ నోట్ కే పరిమితమయ్యింది. ఆ తర్వాత సురేష్ కానీ బి గోపాల్ కానీ బాలకృష్ణతో టై అప్ కాలేదు.
కట్ చేస్తే ఇప్పుడు పవన్ కోసం ఆ టైటిల్ ఫిక్స్ కావడం గమనార్హం. స్వాతంత్రోద్యమం నేపథ్యంలో నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ ని ఎప్పుడూ చూడని సరికొత్త పాత్రలో ప్రేక్షకులు చూడబోతున్నారు. కీరవాణి సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవబోతున్న ఈ హరహర మహాదేవ్ లో నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు ఇప్పటికే అప్ డేట్ ఉంది. అర్జున్ రామ్ పాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్, జయరాం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వకీల్ సాబ్, అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ ల తర్వాత 2022లో ఇది విడుదల కానుంది. ఆ తర్వాత హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కుతుంది