iDreamPost
android-app
ios-app

ఆక్రమణలకు ఎవరైనా ఒక్కటే, బీజేపీ మాజీ ఎంపీని కూడా వదిలిపెట్టని జీవీఎంసీ

  • Published Nov 22, 2020 | 4:22 AM Updated Updated Nov 22, 2020 | 4:22 AM
ఆక్రమణలకు ఎవరైనా ఒక్కటే, బీజేపీ మాజీ ఎంపీని కూడా వదిలిపెట్టని జీవీఎంసీ

విశాఖలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. తర తమ బేధాలు లేకుండా ప్రభుత్వం ముందుకెళుతుంది. పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని రకాల అక్రమాలు సరిచేసేందుకు ప్రయత్నిస్తోంది. సంక్షేమం విషయంలో ప్రాంతం చూడం.. కులం చూడం.. మతం చూడం అని..చివరకు పార్టీ కూడా చూడం అంటూ జగన్ చెప్పినట్టుగానే జరుగుతోంది. ప్రస్తుతం ఆక్రమణల విషయంలో కూడా అదే తీరు కనిపిస్తోంది.

జీవీఎంసీ పరిధిలో ప్రభుత్వ భూములకు విముక్తి కల్పించే యత్నం సాగుతోంది. వివిధ విభాగాల భూములను కబ్జా చేసిన వారి చెర నుంచి విడిపించే ప్రయత్నాలు సాగుతున్నాయి. సబ్బం హరితో స్టార్ట్ చేసి ప్రస్తుతం గోకార్టింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్‌ వరకూ వచ్చింది. మధ్యలో పలువురు విపక్ష నేతలకు చెందిన వివిధ సంస్థల వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) అధికారులు కొరడా ఝుళిపిస్తున్న తీరుతో ప్రస్తుతం బీజేపీ మాజీ ఎంపీ వరకూ వచ్చింది. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబం కొద్ది నెలల క్రితమే వైఎస్సార్సీపీలో చేరింది. అయినప్పటికీ రాజకీయాలతో ప్రమేయం లేకుండా విశాఖలో ఆక్రమణల తొలగింపు ప్రక్రియ చేపట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు గోకార్టింగ్ సెంటర్ లో సీఆర్ జెడ్ నిబంధనల ఉల్లంఘనను ఉపక్షించేది లేదని తేల్చేశారు.

భీమిలి సమీపంలో ఉన్న గోకార్టింగ్‌ సెంటర్‌లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జేసీబీతో గోడలు, హట్‌లు, కంటైనర్‌ రెస్టారెంట్‌లను నేలమట్టం చేశారు. మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అనుచరుడైన కాశీవిశ్వనాథ్, అతని కుటుంబ సభ్యులు మెస్సర్స్‌ కాశీ ఎంటర్‌ప్రైజెస్‌ అండ్‌ రిసార్ట్స్‌ పేరుతో దీనిని ఏర్పాటు చేశారు. 2014 నుంచి 5.05 ఎకరాల్లో ఈ గోకారి్టంగ్‌ సెంటర్‌ నడుస్తోంది. కేవలం కె.నగరపాలెం పంచాయతీ అనుమతి తీసుకుని ఈ వ్యవహారం నడుపుతున్నారు. ఇక్కడ కార్‌ రేసింగ్, స్పోర్ట్స్‌ క్లబ్, రెస్టారెంట్‌ తదితరాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన 0.44 ఎకరాల స్థలాన్ని కూడా ఆక్రమించినట్టు నివేదికలు చెబుతున్నాయి. కె.నగరపాలెం జీవీఎంసీలో విలీనమయిన తర్వాత జీవీఎంసీ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు నిర్వాహకులకు ఏడాది కాలంలో 2సార్లు నోటీసులిచ్చారు. అయినా వారి నుంచి స్పందన రాలేదు. దాంతో ప్రత్యక్ష చర్యలకు పూనుకున్నారు.

మరోవైపు గోకరాజు గంగరాజుకి చెందిన భూముల్లో కూడా సీఆర్ జెడ్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు జరిగినట్టు గుర్తించారు. వాటిని తొలగిండానికి కూడా వెనుకాడకుండా జీవీఎంసీ చర్యలు తీసుకోవడం ద్వారా ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటినట్టయ్యింది. ఆక్రమణలు తొలగించి, విశాఖకు పునుత్తేజం కల్పించడమే లక్ష్యంగా జగన్ సాగుతున్నట్టు స్పష్టమయ్యింది.