iDreamPost
android-app
ios-app

సైకో ‘గన్ షాట్’ పేలలేదు – Nostalgia

  • Published Jan 30, 2021 | 2:13 PM Updated Updated Jan 30, 2021 | 2:13 PM
సైకో ‘గన్ షాట్’ పేలలేదు – Nostalgia

ఒక తరహా స్కూల్ లేదా ఫార్ములాకు అలవాటు పడి అందులోనే గొప్ప విజయాలు అందుకున్న దర్శకులకు అప్పుడప్పుడూ ప్రయోగాలు చేయాలనిపించడం సహజం. కాకపోతే తమది కాని జానర్ సరిగా డీల్ చేయలేకపోతే మాత్రం రిజల్ట్ బాగా తేడా కొట్టేస్తుంది. అందుకే కొందరు రిస్క్ చేయడానికి వెనుకాడితే మరికొందరు చేసి చూద్దాం ఓ ప్రయత్నమేగా అని ముందుకు వెళ్తారు. అలాంటి వాళ్లలో ఎస్వి కృష్ణారెడ్డి ఒకరు. 1996 ఆయన భీభత్సమైన ఫామ్ లో ఉన్న టైం. కామెడీ ప్లస్ ఫ్యామిలీ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా కేవలం ఐదేళ్ల కాలంలోనే ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఆ టైంలోనే ఒక డిఫరెంట్ ఎక్స్ పరిమెంట్ చేయాలనుకున్నారు.

శుభలగ్నం సూపర్ హిట్ తర్వాత స్టార్ హీరోలు పిలిచి మరీ ఇచ్చిన అవకాశాలు టాప్ హీరో, వజ్రం రెండూ కృష్ణారెడ్డి గారు ఉపయోగించుకోలేకపోయారు. బాలయ్య, నాగ్ లను హ్యాండిల్ చేయడంలో పడిన తడబాటు వల్ల ఫ్లాప్ తప్పలేదు. అందుకే పూర్తిగా వెరైటీ సబ్జెక్టు ఏదైనా చేద్దామని ఎంచుకున్న స్క్రిప్టే గన్ షాట్. ఆలీ హీరోగా ప్రకాష్ రాజ్ సైకో కిల్లర్ గా నటించిన ఈ సినిమా ద్వారానే కీర్తి రెడ్డి హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఇది ఆడలేదు కానీ తర్వాత పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో గుర్తింపు తెచ్చుకుంది. దివాకర్ బాబు సంభాషణలు సమకూర్చగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంతో పాటు కథ స్క్రీన్ ప్లే సమకూర్చుకుని స్వంత బ్యానర్ లోనే గన్ షాట్ తీశారు.

పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న సైకో కిల్లర్ ప్రకాష్(ప్రకాష్ రాజ్) చేతికి అనుకోకుండా రాంబాబు(అలీ) దొరుకుతాడు. ధనవంతురాలైన తన లవర్(కీర్తి రెడ్డి)కోసం వెళ్తుండగా ఇలా ఇరుక్కుపోతాడు. అయితే కట్ చేస్తే ప్రకాష్, రాంబాబులు చిన్నప్పుడే విడిపోయిన తండ్రికొడుకులని తెలుస్తుంది. కొంత డ్రామా అయ్యాక క్లైమాక్స్ లో బిడ్డ చేతిలోనే సైకో కన్ను మూయడంతో కథ ముగుస్తుంది. కృష్ణారెడ్డి నుంచి మంచి ఎంటర్ టైన్మెంట్ ఆశించిన ప్రేక్షకులను 1996 నవంబర్ 15న విడుదలైన గన్ షాట్ తీవ్రంగా నిరాశపరిచింది. సీరియస్ గా చెప్పాల్సిన కథకు అతకని కామెడీ మిక్స్ చేయడంతో డిజాస్టర్ తప్పలేదు. ఆ తర్వాత ఎస్వి తన పాత స్కూల్ లోకి వచ్చి తీసిన మావిచిగురు, వినోదం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేశారు