iDreamPost
android-app
ios-app

అజాద్‌ వెర్సస్‌ రాహుల్‌.. రాజీనామా సవాల్‌..

అజాద్‌ వెర్సస్‌ రాహుల్‌.. రాజీనామా సవాల్‌..

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై 23 మంది సీనియర్లు రాసిన లేఖ ఆ పార్టీలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ(సీడబ్యూసీ)లో లేఖపై వాదోపవాదాలు నడుస్తున్నాయి. లేఖ వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, తన తల్లి అనారోగ్యంతో ఉన్న సమయంలో సీనియర్లు రాసిన లేఖపై రాహుల్‌ గాంధీ తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతున్నారు. సీనియర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తీవ్ర ఆరోపణలు చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ‘చేయి’ దాటిపోయే ప్రమాదం నెలకొంది.

బీజేపీతో కుమ్మక్కు అయ్యే సీనియర్లు లేఖ రాశారని సీడబ్యూసీ సమావేశంలో రాహుల్‌ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. దీంతో సీనియర్‌నేత గులాం నబీ అజాద్‌ కూడా ధీటుగా స్పందించారు. రాహుల్‌ గాంధీ చేసిన ఆరోపణలు రుజువు చేస్తే తాను పార్టీకి రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరారు. 30 ఏళ్లుగా పార్టీకి విధేయుడిగా పని చేశానని అజాద్‌ ఈ సందర్భంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఎప్పుడూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించలేదని రాహుల్‌ ఆరోపణలను అజాద్‌ తిప్పికొట్టినట్లు తెలుస్తోంది. తాము లేఖలో పేర్కొన్న విషయాలు గతంలో రాహుల్‌ గాంధీ ప్రస్తావించిన అంశాలే ఉన్నాయని అజాద్‌ స్పష్టం చేశారు.

అజాద్‌తోపాటు మరో సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ కూడా రాహుల్‌ వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు పని చేశామని, మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానిన గద్దె దింపేందుకు పార్టీ పక్షాన పోరాడామని కపిల్‌ సిబాల్‌ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాము ఇలా పని చేస్తుంటే బీజేపీతో కుమ్మక్కయ్యారని రాహుల్‌ గాంధీ అనడం తనను బాధిస్తోందని కపిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకత్వ సమస్యతో ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పరిస్థితి.. తాజా పరిణామాలతో ఎలా మారుతుందో వేచి చూడాలి.