iDreamPost
android-app
ios-app

ఐకే గుజ్రాల్ ఇచ్చిన సలహా పీవీ నరసింహారావు వినలేదా?

ఐకే గుజ్రాల్ ఇచ్చిన సలహా పీవీ నరసింహారావు వినలేదా?

1984లో జరిగిన సిక్కుల ఊచకోత స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒక చెరగని మచ్చ..ఆనాడు జరిగిన సిక్కుల ఊచకోతలో సుమారు 2800 మంది సిక్కులు ఈ అల్లర్లలో మృతి చెందగా, ఒక్క ఢిల్లీలోనే 2100 మంది సిక్కులు మరణించారని అంచనా. ఒకవేళ 1984లో అప్పటి హోమ్ శాఖ మంత్రి, పీవీ నరసింహారావు, ఐకే గుజ్రాల్ చెప్పిన సలహా విని ఉంటే ఈ అల్లర్లు జరగకుండా ఉండేవని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు.

వివరాల్లోకి వెళితే, ఐకే గుజ్రాల్ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మన్మోహన్ సింగ్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఐకే గుజ్రాల్ ముందుగానే పీవీ నరసింహారావుని పరిస్థితి చేయజారేలా ఉందని,అల్లర్లు జరుగుతాయని హెచ్చరించారని కానీ హోం శాఖా మంత్రి దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఒకవేళ ఆ హెచ్చరికను పరిగణనలోకి తీసుకుని ఆర్మీని రంగంలోకి దించి ఉంటే అల్లర్లు జరిగి ఉండేవి కాదని పేర్కొన్నారు. అల్లర్లు జరిగిన రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఐకే గుజ్రాల్ తాను ఇద్దరం ఒకే గ్రామంలో జన్మించామని తెలిపారు. ఎన్నో ఏళ్ళు కలిసి రాజకీయాలు చేశామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు

కానీ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనుమడు బీజేపీ నేత ఎన్వీ సుభాష్ తప్పు పట్టారు. మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సమర్ధించేవి కాదని ఆయన పేర్కొన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా హోంమంత్రి సొంత నిర్ణయం తీసుకోలేరని, ఒకవేళ ఆ సమయంలో ఆర్మీని రంగంలోకి దింపి ఉంటే పెద్ద విపత్తు జరిగే ఉండేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.