iDreamPost
iDreamPost
గుజరాత్ రాష్ట్ర 17వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర భాయ్ పటేల్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం మధ్యాహ్నం గాంధీనగర్ లో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో భూపేంద్ర పేరును సీఎం పదవికి ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా సిఫార్సు చేయడంతో పార్టీ అధిష్టానం ఆయన్ను కొత్త సీఎంగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రమే భూపేంద్ర పటేల్ గవర్నర్ దేవవ్రత్ ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరనున్నారు. సోమవారం సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
శరవేగంగా పరిణామాలు..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 15 నెలల ముందు గుజరాత్ అధికార పార్టీలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్ ఇచ్చిన ఓ సర్వే నివేదిక ఆధారంగా సీఎం విజయ్ రూపానీని అనూహ్యంగా బీజేపీ నాయకత్వం పదవి నుంచి శనివారం దించేసింది. దాంతో ఆయన వారసుడిగా ఎవరు సీఎం పదవి చేపడతారన్న ఆసక్తి ఏర్పడింది. కొత్త నేతను ఎన్నిక కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ హాజరయ్యారు.
Also Read : గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా
గంటన్నరకు పైగా చర్చల అనంతరం గోట్లాడియా ఎమ్మెల్యే భూపేంద్ర పటేల్ పేరును ప్రకటించారు. వాస్తవానికి కేంద్ర మంత్రులు మాన్షుక్ మండవియ, పురుషోత్తం రూపాలీ, ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆర్.సి. ఫాల్దు, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ కె పటేల్ తదితరుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా చివరి నిమిషంలో భూపేంద్ర పేరు తెరపైకి వచ్చింది. చివరికి అదే ఖరారైంది.
పాటీదార్ కే ప్రాధాన్యం..
అందరూ ఊహించినట్లే పాటీదార్ వర్గానికే బీజేపీ నాయకత్వం ముఖ్యమంత్రి పీఠం అప్పగించింది. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ఆ వర్గాన్ని మచ్చిక చేసుకొని తన వైపు తిప్పుకొనేందుకు బీజేపీ ఈ ఎత్తుగడ వేసింది. ఆరెస్సెస్ కూడా పాటీదార్ నేతకు సీఎం పీఠం ఇవ్వాలని సిఫార్సు చేయడం గమనార్హం. కాగా సీఎం అభ్యర్థిగా ఎన్నికైన భుపేంద్ర పటేల్ గత ఎన్నికల్లో గోట్లాడియా నియోజకవర్గం నుంచి పోటీ చేసి 1.17 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతకు ముందు ఆ నియోజకవర్గానికి మాజీ సీఎం ఆనంది బెన్ పటేల్ ప్రాతినిధ్యం వహించేవారు. భుపేంద్ర గతంలో అహ్మదాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
Also Read : ఆ సర్వే వల్లే విజయ్ రూపాని సీఎం పదవి పోయిందా?