iDreamPost
android-app
ios-app

డిగ్రీ పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు పరీక్షల రాయవలసిందే

డిగ్రీ పీజీ చివరి సంవత్సరం విద్యార్థులు పరీక్షల రాయవలసిందే

పరీక్షల నిర్వహణకు యూజీసీ కొత్త మార్గదర్శకాలు

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన డిగ్రీ,పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణ వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా డిగ్రీ,పీజీ పరీక్షల నిర్వహణకు కేంద్ర హోంశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయా పరీక్షల నిర్వహణపై కొనసాగుతున్న సందిగ్దతకు తెరపడినట్లయింది. గతంలో యూజీసీ(యూనియన్ గ్రాంట్ కమిషన్) జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం డిగ్రీ, పీజీ పరీక్షలను జూలైలోపు పూర్తిచేయాలని చెప్పింది. కాగా తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ లోగా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ వెల్లడించింది.

యూజీసీ కొత్తగా వెల్లడించిన మార్గ దర్శకాల ప్రకారం ఆయా కళాశాలలు/యూనివర్సిటీల్లో చదువుతున్న డిగ్రీ/పీజీ చివరి సంవత్సరం విద్యార్థులకు చివరి సంవత్సరం పరీక్షలు లేదా చివరి సెమిస్టర్ పరీక్షలు తప్పనిసరిగా సెప్టెంబరు చివారిలోపు పూర్తి చేయాలి. పరీక్షల నిర్వహణ ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో నిర్వహించుకునే అధికారం ఆయా కళాశాలలకు/యూనివర్సిటీలకు ఉంది. బ్యాక్‌లాగ్స్‌ ఉన్న చివరి సంవత్సరం విద్యార్థులకు ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ విధానంలో తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలి. సెప్టెంబరులో ఎవరైనా విద్యార్థులు పరీక్షలకు హాజరు కాని నేపథ్యంలో వారికి మరోసారి పరీక్షలు నిర్వహించాలి.

కరోనా కారణంగా ఏర్పడిన ప్రత్యేక పరిస్థితులు కారణంగా గత ఏప్రిల్‌, మే నెలల్లో జరగాల్సిన బీటెక్‌, బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈడీ, బీబీఎ, బీపీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంటెక్‌, ఎల్‌ఎల్‌ఎం, ఎంఈడీ.. ఇతర కోర్సులకు సంబంధించిన చివరి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు నిర్వహణపై సందిగ్దత కూడా నెలకొంది. కాగా కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఆదేశాలతో పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ రావడంతో యూనివర్సిటీలు, కళాశాలలు ఆ దిశగా కసరత్తులు మొదలుపెట్టనున్నాయి. కాగా కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన కొవిడ్‌ – 19 నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది.