iDreamPost
android-app
ios-app

మానవతా మూర్తి .. థెరిసా మాత

  • Published Sep 05, 2021 | 4:50 AM Updated Updated Sep 05, 2021 | 4:50 AM
మానవతా మూర్తి .. థెరిసా మాత

ఆపత్కాలంలో ఆర్తులను ఆదుకునేందుకు ఆ దేవుడే దిగివస్తాడని అంటారు. దైవం మానుష రూపేణా అని అందుకే అంటారు. అలా దేవలోకం నుంచి దిగివచ్చిన దేవదూతే థెరిసా మాత. లేకపోతే ఎక్కడ అల్బేనియా.. ఎక్కడ ఐర్లాండ్.. ఎక్కడ ఇండియా. ఖండాంతరాలు దాటి సామాన్యురాలిగా భారతదేశానికి ఉద్యోగ రీత్యా వచ్చిన ఒక మహిళ .. ఈ దేశాన్నే తన కర్మభూమిగా మార్చుకుంది. అనాథలు, నిరుపేదలకు అక్కున చేర్చుకొని సిస్టర్ అయ్యింది. భయంకర వ్యాధులతో బాధపడుతున్న వారిని చేరదీసి.. నిరంతర సేవలతో మమకారం పంచి మాతృమూర్తిగా.. మదర్ గా మారింది. ఆమె మరెవరో కాదు విశ్వమాత మదర్ థెరిసా. అల్బేనియాలోని స్కాప్జే నుంచి కలకత్తా చేరుకొని.. అక్కడి నుంచి తన సేవలను విశ్వవ్యాప్తం చేసిన ఆ మహానీయురాలు నిజంగా దేవదూతే.

ఇండియాకు వలస

మదర్ థెరిసా అసలు పేరు అంజేజే గోక్సీ బోజాక్సియు. అల్బేనియా రాజధాని అయిన స్కాప్జేలో 1910 ఆగస్టు 26న జన్మించిన ఆమె యుక్త వయసు వచ్చేవరకు 18 ఏళ్లపాటు సొంత ఊళ్లోనే ఉన్నారు. అనంతరం ఐర్లాండ్ వెళ్లారు. అక్కడ కొన్నాళ్లు గడిపిన అనంతరం 1929లో భారతదేశానికి వచ్చారు. జీవితాంతం ఈ దేశ సేవలతోనే తరించారు. మొదట పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ చేరుకున్న ఆమె అక్కడి ఒక కాన్వెంట్లో ఉపాధ్యాయురాలిగా చేరారు. అక్కడే ఆమె నన్ (సన్యాసిని)గా మారి తన పేరును థెరిసాగా మార్చుకున్నారు. 1937లో కలకత్తాకు మారారు. అక్కడి ప్రముఖ లోరేటొ కాన్వెంట్లో ఉద్యోగంలో చేరారు. బెంగాలీ, హిందీ భాషలు నేర్చుకున్నారు. ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొంది రెండు దశాబ్దాలు అక్కడే పనిచేశారు.

Also Read : కార్పొరేషన్ డైరెక్టర్ పదవి- ఇంటికి వెళుతుండగాప్రమాదం జరిగి మరణం

దుర్భర పరిస్థితులతో కలత

ఆనాడు కలకత్తా, చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా దుర్భర పరిస్థితులు ఉండేవి. నిరుపేదల జీవన స్థితిగతలు చూసి థెరిసా తీవ్రంగా కలత చెందారు. దీనికి తోడు 1943లో బెంగాల్ రాష్ట్రం కారువుకాటకాలతో అల్లాడిపోయింది. అది చాలదన్నట్లు 1946 ఆగస్టులో ఆ రాష్ట్రంలో హిందూ ముస్లిం గొడవలు చెలరేగాయి. ఈ ఘటనలను, వాటివల్ల పేదలు నష్టపోతుండటాన్ని కళ్లారా చూసిన థెరిసా సేవా మార్గమే తన గమ్యమని గుర్తించారు. ఉపాధ్యాయ వృత్తిని వీడి సేవామూర్తిగా మారి కొత్త జీవితం ప్రారంభించారు. కరువు పరిస్థితులు, మత ఘర్షణల్లో బాధితులైన వారిని ఆదుకునేందుకు నడుం కట్టారు. ఎంతోమందిని ఆదరించి, ఆశ్రయం కల్పించారు.

మిషనరీస్ ఆఫ్ చారిటీతో సేవల విస్తృతి

సేవా కార్యక్రమాలను ఒక గొడుగు కిందికి తీసుకొచ్చేందుకు వీలుగా కలకత్తా కేంద్రంగా 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థను నెలకొల్పారు. వైద్యంపై ప్రాథమిక అవగాహన కోసం పట్నాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో శిక్షణ తీసుకున్నారు. అయితే ఆర్థిక సమస్యలు ఆమెను వెంటాడాయి. సేవా కార్యక్రమాలకు డబ్బులు లేక.. సాయం కోసం ఎవరి వద్దకు వెళ్లినా అనుమానంగా చూశారు. అయినా నిరుత్సాహపడకుండా సొంత డబ్బులతో కార్యకలాపాలు కొనసాగించారు. 1952లో ఆమెకు మొదటిసారి కలకత్తా అధికారుల సహాయం అందింది. వారి సహకారంతో మొదటి ఆస్పత్రి ప్రారంభించారు. ఒక పురాతన దేవాలయాన్ని కాళీఘాట్ హోమ్ ఆఫ్ ఫ్యూర్ హార్ట్ (నిర్మల్ హృదయ)గా మార్చారు. 1955లో అనాథ బాలల కోసం ప్రత్యేక శిశుగృహ ప్రారంభించారు. అక్కడి నుంచి మదర్ థెరిసా సేవలు విస్తృతమయ్యాయి. ఎయిడ్స్, కుష్టు, టీబీ రోగుల కోసం ఆస్పత్రులు, మొబైల్ క్లినిక్లు, కుటుంబ, పిల్లల కౌన్సిలింగ్ కేంద్రాలు, అనాథ శరణాలయాలు, పాఠశాలలు వేలాదిగా ఏర్పాటు చేశారు.

Also Read : కోగంటి సత్యం – ఎందుకిలా?

అంతర్జాతీయంగానూ..

కలకత్తాలో ప్రారంభమైన మదర్ థెరిసా సేవాయజ్ఞం క్రమంగా దేశమంతటికీ.. ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించింది. మదర్ థెరిసా కన్నుమూసే నాటికి 4500 మంది నన్స్ తో 133 దేశాల్లో మిషమరీస్ ఆఫ్ చారిటీ సేవలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధంలో దెబ్బతిన్న బీరుట్లో చిక్కుకున్న 37 మంది బాలలను 1982లో మదర్ రక్షించి చేరదీశారు. క్షామంతో అల్లాడుతున్న ఇథియోఫియా మరికొన్ని ఆఫ్రికా దేశాల్లో, రష్యాలో చెర్నోబిల్ అణు ప్రమాద సమయంలోనూ, ఆర్మేనియా భూకంప బాధితులను ఆదుకోవడానికి థెరిసా సంస్థలు అవిరళ కృషి చేశాయి.

2003లో దివ్యత్వం(సెయింట్ హుడ్)

అపురూపమైన సేవా ప్రపంచాన్ని నిర్మించిన మదర్ థెరిసాకు ఎన్నో ప్రపంచస్థాయి అవార్డులు మోకరిల్లి సలాం చేశాయి. 1962లో రామన్ మెగసేసె అవార్డ్ లభించింది. 1979లో నోబెల్ శాంతి బహుమతి అందికున్నారు. మనదేశ అత్యున్నత పౌర పురష్కారం భారతరత్నతో పాటు ఆర్డర్ ఆఫ్ స్మైల్, గోల్డెన్ హానర్ ఆఫ్ ది నేషన్ వంటి ఎన్నో అవార్డులు వరించాయి. అనారోగ్యంతో 1997 మర్చిలో సేవలను చాలించిన మదర్ అదే ఏడాది సెప్టెంబర్ ఐదో తేదీన తనువు చాలించారు. మరణానంతరం మదర్ థెరిసా కు సెయింట్ హోదా లభించింది. 2003 అక్టోబర్ 19న వాటికన్ సిటీలోని సెయింట్ పేటర్స్ స్క్వేర్ లో బ్యూటీఫికేషన్ నిర్వహించి దివ్యత్వం కల్పించారు.

(నేడు మథర్ థెరిసా వర్ధంతి )