iDreamPost
android-app
ios-app

భార‌త్‌లో లక్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు

భార‌త్‌లో లక్ష కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు

దేశంలో అత్య‌ధికంగా క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు మ‌హారాష్ట్రలో న‌మోదౌతున్నాయి.ఆ రాష్ట్రంలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు బయట పడుతుండటంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది.కాగా తాజాగా దేశంలో లక్ష కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో తమిళనాడు చేరింది.

నేటికి తమిళనాడులో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య లక్ష దాటింది.దీంతో భార‌త్‌లో లక్ష కరోనా కేసులు దాటిన రెండో రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. గడిచిన 24 గంటలలో తమిళనాడులో 4329 కొత్త కేసులు నమోదు కాగా 64 మంది మృత్యువాత పడ్డారు. ఇక చెన్నై నగరంలోనే కొత్తగా 2082 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,689 కి చేరుకుంది.తమిళనాడులో మొత్తం కోవిడ్-19 బాధితుల సంఖ్య 1,02,721కి చేరగా,1385 మంది వైరస్ బారినపడి మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా తమిళనాడులో వైరస్ సామూహిక వ్యాప్తి లేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి.విజయభాస్కర్ ప్రకటించడం గమనార్హం.

ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా కేసులు లక్షకు దగ్గరగా ఉంది.మరో రెండు రోజులలో లక్ష కేసులు దాటిన జాబితాలో మూడో రాష్ట్రంగా ఢిల్లీ చేరే అవకాశం ఉంది.

ఇక భారత్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి రోజు రోజుకి తీవ్రమవుతున్న పరిస్థితిలో నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల సంఖ్యను ప్ర‌భుత్వం పెంచింది. దేశ‌వ్యాప్తంగా నిన్న (జులై 3) ఒక్కరోజే 2,42,383 మందికి ప‌రీక్ష‌లు చేసినట్లు భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌) వెల్ల‌డించింది.దీంతో ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 95,40,132 శాంపిళ్ల‌ను ప‌రీక్షించిన‌ట్లు వెల్లడించింది.