iDreamPost
android-app
ios-app

గన్ను పట్టిన గిరిజన ‘సఖి’

  • Published Aug 15, 2020 | 5:48 AM Updated Updated Aug 15, 2020 | 5:48 AM
గన్ను పట్టిన గిరిజన ‘సఖి’

మహానటి తర్వాత తెలుగు స్ట్రెయిట్ సినిమాల్లో కనిపించకుండా పోయిన కీర్తి సురేష్ కొత్తగా బ్యాక్ టు బ్యాక్ రెండు చిత్రాలతో పలకరించబోతోంది. అందులో మొదటిది గుడ్ లక్ సఖి. ఇండిపెండెన్స్ డే సందర్భంగా టీజర్ ని విడుదల చేసింది టీమ్. అనగనగా ఓ తండాలాంటి గ్రామంలో ఓ గిరిజన యువతి(కీర్తి సురేష్). దురదృష్టాన్ని భుజాన వేసుకుని తిరుగుతుందని అందరూ గేలి చేస్తూ ఉంటారు. ఎంత బ్యాడ్ లక్ అంటే పీటల మీద తాళి కట్టబోయే సమయంలో పెళ్లికొడుకు జబ్బుపడి ఆసుపత్రికి పరిగెత్తేంత. అదే ఊళ్ళో నాటకాలు వేసుకుంటూ ఓ స్నేహితుడు(ఆది పినిశెట్టి)తో ప్రేమలాంటి ఫ్రెండ్ షిప్.

ఈమె జీవితం ఇలా సాగుతుండగా రైఫిల్ షూటింగ్ లో అడుగు పెడుతుంది సఖి. చదువురాని ఆమెకో లక్ష్యాన్ని ఏర్పరుస్తాడు కోచ్ (జగపతిబాబు), అసలు ఎక్కడో ఉండే సఖి క్రీడా ప్రపంచంలోకి ఎలా వచ్చింది, గుడ్ లక్ సఖిగా ఎలా మారిందన్నది కథగా కనిపిస్తోంది. చాలా విలక్షణమైన సినిమాలు తీస్తాడని పేరున్న నగేష్ కుకునూర్ దర్శకుడు కావడంతో ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. కీర్తి సురేష్ తనదైన శైలిలో చెలరేగిపోయింది. నిమిషం టీజర్ లోనే దీనికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. పల్లెటూరి నేపథ్యం నుంచి డిఫరెంట్ సెటప్ కు మార్చిన వైనం ఆకట్టుకునేలా సాగింది. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం విశేషం. దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర దీన్ని నిర్మించారు.

ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ని సైతం ఆకట్టుకునేలా బ్యాక్ డ్రాప్ ఉండటం గమనార్హం. ఇంత గ్యాప్ కు న్యాయం చేకూర్చేలా కీర్తి సురేష్ సరైన కథలను ఎంచుకుంటోంది. టీజర్ లో త్వరలో విడుదల అని చెప్పారు కాని థియేటర్లలోనా లేక ఓటిటినా అని మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. డిజిటల్ టాక్స్ జరుగుతున్నట్టుగా గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. కమింగ్ సూన్ అన్నారు కాబట్టి అంచనాలకు తగ్గట్టే చిన్నితెరపై వచ్చినా ఆశ్చర్యం లేదు. అధికారిక ప్రకటన వచ్చే దాకా ఏమి చెప్పలేం. ఆది పినిశెట్టి, కీర్తి సురేష్ మొదటిసారి కాంబినేషన్ గా వస్తున్నారు. 2016లో వచ్చిన ధనక్ తర్వాత నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన సినిమా గుడ్ లక్ సఖినే కావడం విశేషం. దీన్ని తమిళం, మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు

Teaser Link Here @ https://bit.ly/3at239J