సినీ పరిశ్రమకు చెందిన సమస్యల మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చిరంజీవి సహా సినీ ప్రముఖుల బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. సుమారు గంట పాటు జరిగిన ఈ భేటీలో దాదాపు 17 అంశాలకు సంబంధించి చిరంజీవి బృందం తమ సమస్యలను వివరించింది. ఈ భేటీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఈ రోజుతో ఆంధ్రప్రదేశ్ సినిమా టికెట్ల విషయంలో నెలకొన్న అనిశ్చితి తొలగిపోయిందని ఆయన అన్నారు. ఆ సమస్యకు ఈ రోజుతో ఒక రకంగా శుభంకార్డు పడినట్లేనని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఇలా చర్చ జరపడానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారం కావడం కోసం వైయస్ జగన్ చూపిన చొరవ మరువలేనిది అని ఒక పక్క తాను మాట ఇచ్చినట్లు పేద ప్రజలకు తక్కువ రేటుకే వినోదం అందించాలని ఆయన ప్రయత్నం అద్భుతమైనదని చిరంజీవి కొనియాడారు.
తాను గతంలో వైఎస్ జగన్ గారితో భేటీ అయినప్పుడు తమ సమస్యలు ఆయన ముందుకు తీసుకురాగా ఇప్పుడు ఆయన చూపిన పరిష్కారం మా అందరికీ బాగా నచ్చిందని చిరంజీవి వెల్లడించారు. అలాగే చిన్న సినిమాల మీద కూడా వైఎస్ జగన్ చాలా సానుకూల దృక్పథంతో ఉన్నారని అందుకే రోజులో 5వ షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారని చిరంజీవి వెల్లడించారు. ఈ విషయం గురించి అడిగిన వెంటనే అక్కడికక్కడే ఆమోదం తెలిపారని చిరంజీవి వెల్లడించారు. ఈ 5 వ షోకి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలామందికి ఉపయోగపడుతుందని, సినీ పరిశ్రమ ఉన్నతికి బాగా ఉపయోగపడుతుందని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే ఈ రోజు పెద్ద సినిమాలు తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా తెలియ చెబుతున్నాయని, అలాంటి సినిమాల విషయంలో ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయం మీద మరోసారి కమిటీతో చర్చించి ఒక నిర్ణయానికి వస్తామని జగన్ తమతో చెప్పారని చిరంజీవి పేర్కొన్నారు. ఈరోజు జరిగిన చర్చతో మేము చాలా సంతృప్తికరంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
ఇక ఈ చర్చలు ఇంత ఫలప్రదంగా జరగడానికి ముఖ్య కారణం పేర్ని నాని అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయనని ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణలో ఏ విధంగా అయితే సినీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం అనేక రాయితీలు ప్రకటిస్తోందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సినీ పరిశ్రమకు తాము చేయాల్సింది చేస్తామని వైయస్ జగన్ చెప్పడంతో అనేకమంది ఔత్సాహికులకు ఊతం ఇస్తుందని చిరంజీవి అన్నారు. వైజాగ్ లో సినీ షూటింగులకు అనుగుణంగా మరింత డెవలప్ చేయాలని వైఎస్ జగన్ సంకల్పించారు అని అంతకన్నా మాకు సంతోషం ఇంకేం కావాలని చిరంజీవి అన్నారు.
ఇకమీదట ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే సామరస్యంగా పరిష్కరించుకుంటాం అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. అలాగే ఎంతో సామరస్యంగా మాట్లాడి మాకు, సినీ పరిశ్రమకు అండగా నిలబడతామని మాట ఇచ్చిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారికి కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు అని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు.. ఈ నెల మూడో వారంలో టికెట్ రేట్లకు సంబంధించిన జీవో వస్తుందని భావిస్తున్నామని ఆ జీవో ఎంత త్వరగా వస్తే అంత త్వరగా పరిశ్రమ కోలుకుంటుందని చిరంజీవి వెల్లడించారు.
Also Read : సినీ పరిశ్రమకు అండగా ఏపీ ప్రభుత్వం: పేర్ని నాని