iDreamPost
android-app
ios-app

‘గుడ్’ డీల్ రాబట్టుకున్న’సఖి’

  • Published Aug 19, 2020 | 5:42 AM Updated Updated Aug 19, 2020 | 5:42 AM
‘గుడ్’ డీల్ రాబట్టుకున్న’సఖి’

టైటిల్ లోనే విషెస్ చెప్పుకున్న కీర్తి సురేష్ కొత్త సినిమా గుడ్ లక్ సఖి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కల్ట్ సినిమాల ద్వారా తనకంటూ ప్రత్యేమైన ముద్ర వేసుకున్న నగేష్ కుకునూర్ దీనికి దర్శకుడు. ఆది పినిశెట్టి హీరోగా జగపతిబాబు మరో కీలక పాత్ర పోషిస్తున్న ఈ మూవీ పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్. మహానటి తరహాలో నటనకు చాలా స్కోప్ ఉన్న పాత్ర కీర్తి సురేష్ కు దక్కింది. అయితే ఇది ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయం ఇంకా చెప్పలేదు కానీ ఓటిటి టాక్స్ ఒక కొలిక్కి వచ్చాయట అమెజాన్ ప్రైమ్ 12 కోట్లకు కాస్త అటు ఇటుగా డీల్ ని క్లోజ్ చేసినట్టుగా సమాచారం. గుడ్ లక్ సఖి మీద పెట్టిన బడ్జెట్ చూసుకుంటే ఇది చాలా మంచి ధర.

ఒకవేళ వచ్చే నెలనో లేదా ఆపై థియేట్రికల్ రిలీజ్ చేసినా ఇంత మొత్తం షేర్ రావడం అసాధ్యం.జనంలో కరోనా భయం పూర్తిగా జీరో అయ్యేదాకా, ప్రభుత్వం సినిమా హాళ్ల విషయంలో నిబంధనలు పూర్తిగా సడలించేదాకా మీడియం రేంజ్ మూవీస్ కి గడ్డు కాలమే. దాని బదులు ఇలా డిజిటల్ దారిని ఎంచుకోవడం వల్ల నిర్మాత నష్టపోకుండా ఉండటమే కాక అధిక శాతం ప్రేక్షకులు ఆన్ లైన్లలో చూసే అవకాశం దక్కుతుంది. ఒకవేళ సినిమా బాగుంటే వ్యూస్ ఎక్కువగా వచ్చి హక్కులు కొన్న సంస్థలకు కోట్లాది ఆదాయం చేకూరి మరిన్ని సినిమాలు కొనేందుకు పోటీ పడతాయి. సో ఇదంతా మంచి స్ట్రాటజీనే. లాక్ డౌన్ మొదలయ్యాక ఓటిటిలో వచ్చిన మొదటి స్టార్ యాక్టర్ మూవీ కీర్తి సురేష్ దే. టాక్ నెగటివ్ గా వచ్చినప్పటికీ ప్రైమ్ మాత్రం దీని వల్ల చాలా లాభ పడింది.

ఇంట్లోనే కూర్చుని చూసే ఆప్షన్ కావడంతో హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా అకౌంట్ ఉన్న ప్రతిఒక్కరు చూసేశారు. అందుకే ప్రొడ్యూసర్లు సైతం ఇక గిరి గీసుకుని కూర్చుంటే లాభం లేదని తమ నిర్ణయాలు మార్చుకుంటున్నారు. గుడ్ లక్ సఖితో పాటు కీర్తి సురేష్ మరో సినిమా మిస్ ఇండియా కూడా ఇదే తరహాలో విడుదల కావొచ్చని టాక్ ఉంది. దానికి సంబంధించిన సమాచారం ఇంకా రావాల్సి ఉంది. నాని వి వచ్చాక ఓటిటి రంగంలో కదలికలు చాలా వేగంగా ఉండబోతున్నాయి. స్టార్లు కూడా ఒక్కొక్కరుగా ఇదే బాట పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్ధం దాకా థియేటర్లను మాములు స్థితిలో చూడటం కష్టమే. ఎంత ఆలస్యమైనా అది ఇచ్చే అనుభూతికి ఇంకేదీ దరిదాపుల్లోకి రాలేదు కాబట్టి మూవీ లవర్స్ ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. కాకపోతే అంత త్వరగా జరిగే అవకాశాలు మాత్రం తక్కువే