కొన్ని జ్ఞాపకాలకు వెల కట్టలేం. వర్తమానంలో చిన్నదిగా కనిపించేది భవిష్యత్తులో డబ్బుకందని గొప్ప బహుమతిగా నిలిచిపోతుంది. అలాంటిదే ఇది కూడా. ఇక్కడ ఫోటోలో ఉన్నది ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ రజనికాంత్ పక్కన వినయంగా నిలబడిన లారెన్స్ మాస్టర్ ని చూస్తే ఆశ్చర్యం వేస్తోంది కదూ. గ్రూప్ డాన్సర్స్ లో ఒకడిగా ‘ఉజైపలి’ సినిమాకు పనిచేసినప్పుడు తన అభిమాన హీరోతో తీయించుకున్న జ్ఞాపకాన్ని లారెన్స్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అప్పుడు గుంపులో కలిసిపోయిన లారెన్స్ ఇప్పుడు ఏకంగా రజనీకాంత్ తో కలిసి సమానంగా స్క్రీన్ షేర్ చేసుకుంటూ చంద్రముఖి 2 చేసే స్థాయికి చేరుకున్నాడంటే ఇంతకన్నా గొప్ప ఉదాహరణ వేరే కావాలా.
ఇక పిక్ విషయానికి వస్తే ఈ ఉజైపలి 1993లో పి వాసు దర్శకత్వంలో వచ్చింది. దీన్నే తెలుగులో ‘ఘరానా కూలి’గా డబ్బింగ్ చేశారు. ఒకప్పుడు మాయాబజార్, పాతాళభైరవి లాంటి క్లాసిక్స్ నిర్మించిన విజయా సంస్థ ఇరవై ఏళ్ళ గ్యాప్ తర్వాత నిర్మించిన చిత్రమిది. రోజా హీరొయిన్ గా నటించింది. మాములు కూలిగా ఉండే ఒక వ్యక్తి అనూహ్యంగా కోట్లాది రూపాయల సంపదకు వారసుడినని తెలిసినప్పుడు జరిగే పరిణామాలను వాసు కథగా మలిచారు. ఎంజిఆర్ హిట్ మూవీని దీనికి స్ఫూర్తిగా తీసుకున్నారు వాసు. అంతకు ముందు రేగిన ఓ వివాదం వల్ల తమిళనాడులో ఈ సినిమాను బ్యాన్ చేయాలనీ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నారు. అయితే కమల్ హాసన్ లాంటి ఎందరు ప్రయత్నించినా రాజీ కుదరలేదు. పంపిణీదారులు మంకుపట్టు విడవకపోవడంతో రిలీజ్ డేట్ దగ్గర పడినా పరిస్థితి కుదుటపడలేదు.
దీంతో రజని స్వయంగా రంగంలోకి నేరుగా థియేటర్లో విడుదల చేసేలా తన సంస్థ ద్వారా ఏర్పాట్లు చేసుకున్నాడు. అనుకున్న టైంకే ప్రింట్లు వెళ్ళిపోయి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చాలా చోట్ల వందరోజులు ప్రదర్శించారు. విజయ సంస్థకు మంచి లాభాలు వచ్చాయి. దీని తర్వాతే వరసగా తెలుగులో భైరవ ద్వీపం బృందావనం లాంటి చిత్రాలకు శ్రీకారం చుట్టారు. విజయాలు అందుకున్నారు. ఇందులో పాటల్లో రజని పక్కన డాన్సర్స్ లో లారెన్స్ ని గమనించవచ్చు. ముఠామేస్త్రిలో చిరంజీవి, రజనికాంత్ తో ఘరానా కూలిలో ఒకే సంవత్సరం లారెన్స్ ఇలా అరుదైన జ్ఞాపకాలు పదిలపరుచుకోవడం చూస్తే కష్టపడే వాడికి ఎప్పటికైనా విజయం దక్కితీరుతుందని చెప్పడానికి ఇదే గొప్ప నిదర్శనమని చెప్పొచ్చు.