Idream media
Idream media
కేరళలో తీవ్ర కలకలం సృష్టించిన బంగారం అక్రమ రవాణా (గోల్డ్ స్మగ్లింగ్)కు రాజకీయ రంగు అంటింది. ఈ కేసును పారదర్శకంగా విచారణ జరపాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. మరోవైపు పినరయి విజయన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బిజెపిలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర హోం శాఖ ఈ కేసును ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కి అప్పగించింది.
దుబాయ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) దౌత్య కార్యాలయం పేరుతో చార్టర్డ్ విమానంలో తిరువనంతపురం విమానాశ్రయానికి వచ్చిన సరుకును ఈ నెల 5న కస్టమ్స్ అధికారులు తనిఖీ చేసి దౌత్య కార్యాలయానికి చెందిన పార్శిల్లో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణంగా దౌత్యమార్గంలో వచ్చిన సరుకును కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయరు. కానీ, పక్కా సమాచారంతో తనిఖీలు చేపట్టామని, గృహోపకరణాల మధ్యలో బంగారాన్ని గుర్తించామని అధికారులు తెలిపారు.
దౌత్య కార్యాలయానికి చెందిన ప్యాకేజీలో బంగారం పట్టుబడటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న యుఎఈ కార్యాలయ ఉద్యోగితోపాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలోని మహిళా ఉద్యోగిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో యుఎఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి సరిత్ కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. స్వప్న సురేశ్‌ను ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. అటు కేరళ సర్కారు సిఎం ముఖ్య కార్యదర్శి శివశంకర్‌ను తప్పించింది. స్వప్న సురేశ్‌ను ఐటీ శాఖలో నియమించడానికి, సిఎంవోలో స్వేచ్ఛనివ్వడానికి కారకుడంటూ ఆయనపై వేటు వేసింది.
ఈ వ్యవహారం కేరళలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. కేరళ ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలకు దీంతో సంబంధాలు ఉన్నాయని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో సిఎం పినరయి విజయన్ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. దౌత్య కార్యాలయ ప్యాకేజీకి, సిఎం కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. పూర్తి దర్యాప్తునకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
మరోవైపు ఢిల్లీలోని యుఎఈ రాయబార కార్యలయం కూడా దీనిపై స్పందించింది. ఘటనకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేసింది. నిందితులు కార్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరించారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
కేంద్రం దీన్ని సీరియస్ గా తీసుకుందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ అన్నారు. రాజకీయాలకతీతంగా విచారణ పారదర్శకంగా జరిపించాలని కోరుతూ కేరళ సిఎం పినరయి విజయన్ ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ కేసును ఎన్ఐఏ అప్పగించింది. వ్యవస్థీకృత అక్రమ రవాణాల వల్ల జాతీయ భద్రతకు భంగం కలిగే ప్రమాదం ఉందని అభిప్రాయపడింది.
ఎవరీ స్వప్న సురేశ్..?
కేరళ గోల్డ్ స్కామ్ మొత్తం స్వప్న సురేశ్ చుట్టే తిరుగుతోంది. ఆమె సోషల్ మీడి యా ప్రొఫైల్స్‌లో సిఎం విజయన్‌తోపాటు ప్రముఖులతో దిగిన ఫొటోలున్నాయి. ఆమె కెరీర్ మొత్తం వివాదాలమయమే. తొలుత తిరువనంతపురంలో ట్రావెల్ ఏజెంట్‌గా పనిచేసిన స్వప్న 2010-11లో దుబాయ్ వెళ్లింది. అక్కడి విమానాశ్రయంలో పనిచేస్తుండగా ఆరోపణలు రావడంతో మళ్లీ కేరళకు వచ్చింది. తరువాత ఎయిర్ ఇండియా ఏజెంట్‌గా తిరువనంతపురంలో పనిచేసింది.
యుఎఈ కాన్సులేట్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం సంపాదించింది. అక్కడా ఆరోపణలు రావడంతో తొలగించారు. తరువాత కేరళ ఐటీ మౌలిక సదుపాయాల సంస్థలో లైజనింగ్ అధికారిగా చేరింది. ప్రస్తుతం పరారీలో ఉన్న స్వప్న తన అడ్వొకేట్ ద్వారా కేరళ హైకోర్టు ఆన్లైన్లో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది.