iDreamPost
android-app
ios-app

కర్నూలు జిల్లాలో బంగారు గనులు -స్వతంత్ర భారతంలో ఏర్పాటుకానున్న తొలి గోల్డ్ మైన్

  • Published Feb 17, 2022 | 11:12 AM Updated Updated Mar 09, 2022 | 1:32 PM
కర్నూలు జిల్లాలో బంగారు గనులు  -స్వతంత్ర భారతంలో ఏర్పాటుకానున్న తొలి గోల్డ్ మైన్

అంగళ్లలో రతనాలు అమ్మినారట ఇచట.. అని శ్రీకృష్ణదేవరాయల పాలనలో విజయనగర సామ్రాజ్య వైభవాన్ని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. ఆనాడు రాయలు ఏలిన రతనాల సీమలో భాగమైన రాయలసీమ ప్రకృతిపరంగానే బంగారుసీమ అని స్పష్టం అవుతోంది. ఈ సీమలో కర్నూలు, అనంతపురం జిల్లాల భూగర్భంలో అపారమైన బంగారు నిక్షేపాలు ఉన్నట్లు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది. దాదాపు పాతికేళ్ల క్రితమే అనంతపురం జిల్లా రామగిరి మండలంలో బంగారు నిక్షేపాల వెలికితీతకు ఒక ఆస్ట్రేలియా సంస్థ ముందుకొచ్చింది. కానీ అక్కడి రాజకీయ పరిస్థితులు చూసి వెనక్కి వెళ్ళిపోయింది. ఆ అవకాశం ప్రస్తుతం కర్నూలు జిల్లా తలుపుతట్టింది. జిల్లాలోని జొన్నగిరిలో బంగారం వెలికితీత ప్లాంట్ ఏర్పాటుకు జియో మైసూర్ అనే సంస్థ చర్యలు చేపట్టింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏడాదిలోనే ఇక్కడ బంగారం మైనింగ్ ప్రారంభం కావచ్చు.

 

2004లోనే నిక్షేపాల గుర్తింపు

తుగ్గలి, మద్దికెర మండలాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ 2004లోనే నిర్ధారించింది. మైనింగ్ రంగంలో విదేశీ పెట్టుబడులకు కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత 2005లో జియో మైసూర్ సంస్థ తుగ్గలి మండలం జొన్నగిరిలో గోల్డ్ మైనింగ్ నిర్వహణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసింది. ఆనాటి వైఎస్ ప్రభుత్వం దాన్ని పరిశీలించి అనుమతుల జారీకి సిద్ధం అయ్యింది. అయితే వైఎస్ అకాల మరణం, తదనంతరం మారిన రాజకీయ పరిస్థితులు, తెలంగాణ ఉద్యమం వంటి ఆటంకాలతో ఈ ప్రతిపాదన తెరమరుగైంది.

 

పైలట్ ప్రాజెక్టులో అనుకూల ఫలితాలు

అవాంతరాలన్నింటినీ అధిగమించి 2013లో జియో మైసూర్ మైనింగ్ నిర్వహణకు అనుమతి పొందింది. 2014లో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టింది. రెండు మండలాల్లో 350 ఎకరాల భూములు కొనుగోలు చేసింది. మరో 1500 ఎకరాలను రైతుల నుంచి లీజుకు తీసుకుంది. రూ.95 కోట్లతో 350 ఎకరాల్లో మైనింగ్, ప్రాసెసింగ్ యూనిట్, డంప్ యార్డ్, రిజర్వాయర్ నిర్మించింది. మిగిలిన 1500 ఎకరాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టి బంగారం లభ్యత, నాణ్యత, లాభదాయకతపై శాస్త్రీయ అధ్యయనం చేసింది. ఫలితాలు అనుకూలంగా ఉండటంతో వాణిజ్యపరంగా మైనింగ్ నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. సుమారు రూ. 300 కోట్లతో యంత్ర సామాగ్రి కొనుగోలు చేసి ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయి ప్లాంట్ నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు.

 

రాష్ట్రంలో తొలి గోల్డ్ మైన్

మైనింగ్ ప్లాంట్ ఏర్పాట్ల పురోగతిని కర్నూల్ జిల్లా కలెక్టర్, పరిశ్రమల శాఖ అధికారులు వారం వారం సమీక్షిస్తున్నారు. నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి 12 నెలల్లో ఉత్పత్తికి సిద్ధం అవుతుందని జియో మైసూర్ వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కాగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏర్పాటవుతున్న తొలి గోల్డ్ మైన్ ఇదే కావడం విశేషం. 1880లో కర్ణాటకలోని కోలారులో తొలిసారి బంగారు గనులు ప్రారంభమయ్యాయి. 1945లో రాయచూరు సమీపంలో హట్టి బంగారు గనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు కర్నూలు జిల్లాలో గోల్డ్ మైన్ ఏర్పాటు అవుతోంది.