iDreamPost
android-app
ios-app

గోకుల్‌ఛాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌

గోకుల్‌ఛాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌లో ప్రఖ్యాతగాంచిన గోకుల్‌ ఛాట్‌లో కరోనా కలకలం రేగింది. గోకుల్‌ ఛాట్‌ యజమాని విజయార్గికి కరోనా వైరస్‌ సోకింది. మూడు రోజుల క్రితం ఆయన అనారోగ్యానికి గురికాగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో దుకాణం మూసివేశారు. అక్కడ పని చేస్తున్న 20 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

హైదరబాద్‌లోని కోఠిలో గోకుల్‌ఛాట్‌ ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇటీవల వరకూ మూసివేసిన గోకుల్‌ ఛాట్‌ సడలింపులు ఇవ్వడంతో ఈ నెల 8వ తేదీ నుంచి తిరిగి తెరిచారు. అయితే పార్శిళ్లకు మాత్రమే ఇస్తున్నారు. క్యాష్‌ కౌంటర్‌లో ఉండే యజమాని కొనుగోలుదారుల నుంచి నేరుగా నగదు స్వీకరిస్తారు. మరో గుమస్తా నగదు స్వీకరించినా.. తిరిగి కొనుగోలు దారులకు చిల్లర గుమస్తా ద్వారానే ఇస్తారు. అంతేకాకుండా క్యాష్‌ కౌంటర్‌ ముందు ఉండే సమోసా, మిర్చి బజ్జీలు యజమాని విజయార్గినే కొనుగోలుదారులకు స్వయంగా అందిస్తారు.

గోకుల్‌ఛాట్‌ యజమానికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దుకాణం మూసివేశారు. దుకాణం లోపల, వెలుపలి ప్రాంతాలను సానిటైజ్‌ చేస్తున్నారు. దుకాణానికి వచ్చిన వారు ఆ పక్కన ఉండే పండ్లు కొనుగోలు చేస్తారు. బుక్స్‌ కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో యజమాని నుంచి ఎంత మందికి వైరస్‌ వ్యాపించి ఉంటుందనేది అధికారులకు అంతుబట్టకుండా ఉంది.

2007లో గోకుల్‌ఛాట్‌లో ఉగ్రవాదుల బాంబు పేలుళ్ల తర్వాత అక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ప్రస్తుతం దుకాణానికి వచ్చే వారు ఆయా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యే అవకాశం ఉంది. అయితే దీని వల్ల వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించడం సాధ్యం కానిపని. దుకాణం వద్దకు వచ్చే వారి నుంచి వివరాలు ఏమీ సేకరించరు. ఈ నేపథ్యంలో గత మూడు రోజుల నుంచి దుకాణానికి వచ్చిన వారిని అప్రమత్తం చేసేందుకు అధికారులు మీడియా, ఇతర సమాచార, ప్రసార సాధనాలను ఉపయోగిస్తున్నారు. మూడు రోజులుగా గోకుల్‌ఛాట్‌కు వచ్చిన వారికి కరోనా సోకే అవకాశం ఉందని, వారందరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వైద్య పరీక్షలు, వైద్యం కోసం స్వచ్చందంగా రావాలని కోరుతున్నారు.