iDreamPost
android-app
ios-app

పోలవరం నుంచి డెల్టా వైపు గోదావరి పరుగులు, ప్రాజెక్టు చరిత్రలో కీలక అధ్యాయం

  • Published Jun 11, 2021 | 6:04 AM Updated Updated Jun 11, 2021 | 6:04 AM
పోలవరం నుంచి డెల్టా వైపు గోదావరి పరుగులు, ప్రాజెక్టు చరిత్రలో కీలక అధ్యాయం

పోలవరం ప్రాజెక్టు. దశాబ్దాల నాటి చరిత్ర. గోదావరి జలాలను పోలవరం నుంచి పొలాలకు మళ్లించాలని ఎంతో మంది, ఎన్నో విధాలుగా శ్రమించారు. కానీ నెరవేరలేదు. ఎట్టకేలకు వైఎస్సార్ హయంలో పురుడు పోసుకున్న ఈ ప్రాజెక్టు నుంచి ఇప్పటికీ డెల్టా వైపు గోదావరి దారితీసేందుకు మార్గం సుగమం అయ్యింది. 2021 జూన్ నాటికి గోదావరి నీటిని పోలవరం ప్రాజెక్టు ద్వారా మళ్లిస్తామని సీఎం జగన్ చెప్పిన మాట ఆచరణ రూపం దాలుస్తోంది. స్పిల్ వే నుంచి అప్రోచ్ చానెల్ ద్వారా నీటిని మళ్లించే ప్రక్రియ మొదలయ్యింది.

పోలవరం ప్రాజెక్టు నుంచి ప్రజలకు తొలి ఫలితం దక్కడానికి అంకురార్పణ జరిగింది. స్పిల్ వే మీదుగా గోదావరి డెల్టాకు నీటి మళ్లింపు మొదలయ్యింది. వాస్తవానికి స్పిలల్ వే నిర్మాణం అనేక ఛాలెంజెస్ మధ్య జరిగింది. చంద్రబాబు ప్రభుత్వ హయంలో ప్రచారం ఎక్కువ పనులు తక్కువా అన్నట్టుగా మారిన తరుణంలో జగన్ సర్కారు రివర్స్ టెండరింగ్ ద్వారా ఆ పనులను మేఘా సంస్థకు అప్పగించింది. ఆ తర్వాత కరోనా , వరుసగా రెండేళ్లు వరదలు వంటి ఆటంకాలు వచ్చినా అలుపెరగకుండా శ్రమించారు. కష్టకాలంలోనూ, ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలోనూ ప్రాజెక్టు పనులు ఆగకుండా ప్రణాళికలు వేశారు. ఫలితంగా స్పిల్ వే నిర్మాణం పూర్తికావడంతో ప్రస్తుతం నదీ జలాల తరలింపునకు అవకాశం వచ్చింది.

కాఫర్ డ్యామ్ ని పూర్తిగా మూసివేసి గోదావరిని ఎడమ వైపు నుంచి కుడివైపు మళ్లించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా శబరి నది నుంచి వరద నీరు రావడంతో ఈసారి జూన్ రెండోవారంలోనే నదీ జలం రంగు మారి వరద ప్రవాహం మొదలయ్యింది. దాంతో ఈ నీటిని స్పిల్ వే నుంచి స్పిల్ చానెల్ ద్వారా దిగువన నదీ ప్రవాహంలోకి తరలిస్తున్నారు. ఆ క్రమంలోనే స్పిల్ వే వద్ద నుంచి అప్రోచ్ చానెల్ కి గోదావరి నీటిని తరలించడంతో డెల్టా దిశగా నదీ జలాల ప్రవాహం మొదలయ్యింది. ఆ నీరు స్పిల్ వే, రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ కు చేరి, అక్కడి నుంచి సెంట్రల్ డెల్టాతో పాటు తూర్పు, పశ్చిమ కాలువల ద్వారా గోదావరి డెల్టా కు చేరిక తో పంటలకు ప్రయోజనం కలిగించబోతోంది.

అప్రోచ్ ఛానెల్, స్పిల్ వే గేట్ల ఏర్పాటు, స్పిల్ ఛానెల్, పైలెట్ ఛానెల్ దాదాపు పూర్తి కావడం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ఘట్టంగా చెప్పవచ్చు. గోదావరి నదిలో ప్రవాహానికి అడ్డుకట్ట వేసేవిధంగా అప్పర్ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేసి రికార్డు స్థాయిలో 6.6 కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహం మళ్లింపు జరుగుతోంది. అతి తక్కువ సమయం భారీ పనులు,నిర్మాణాలు పూర్తి చేసి,డెల్టా కు నీరందించే ప్రక్రియ పూర్తి చేసిన మేఘా ఇంజనీరింగ్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. జగన్ సర్కారు చిత్తశుద్ధిని అభినందిస్తున్నారు. ఇక స్పిల్ వే అప్రోచ్ చానెల్ ద్వారా నీటి తరలింపు ప్రక్రియ ప్రారంభానికి వర్చువల్ ద్వారా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్,ఆళ్ల నాని హాజరయ్యారు. ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే బాలరాజు ఈఎన్ సీ నారాయణ రెడ్డి సహా అధికారులు,మేఘా ఇంజనీరింగ్ నుండి రంగరాజన్ వంటి వారు పాల్గొన్నారు.