iDreamPost
android-app
ios-app

నటి గీతాంజలి కన్నుమూత

  • Published Oct 31, 2019 | 3:44 AM Updated Updated Oct 31, 2019 | 3:44 AM
నటి గీతాంజలి కన్నుమూత

సీనియర్‌ నటి గీతాంజలి(62)కన్నుమూశారు. బుధవారం ఆమెకు గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తీసుకొచ్చారు. రాత్రి 11.45 గంటలకు మరోసారి గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. గీతాంజలి తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మళయాలం, హిందీ భాషల్లోనూ నటించారు. సహనటుడు రామకృష్ణను వివాహం చేసుకున్న గీతాంజలి అసలు పేరు మణి.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జన్మించిన గీతాంజలి 1961లో ఎన్టీఆర్‌ దర్శకత్వం వహించిన సీతారామ కళ్యాణం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటించి మెప్పించారు. కాలం మారింది, పూల రంగడు, శారద, డాక్టర్‌ చక్రవర్తి, పూలరంగడు, మురళీకృష్ణ, అవేకళ్లు, సంబరాల రాంబాబు, కలవారి కోడలు, గుఢచారి 116, దేవత, నిండు హృదయాలు వంటి హిట్‌ సినిమాల్లో నటించి మంచిపేరు సంపాదించారు. తరువాతి కాలంలో క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా మారిన ఆమె పెళ్ళైన కొత్తలో,మాయాజాలం, భాయ్‌, గ్రీకువీరుడు తదితర చిత్రాల్లో నటించారు. కాగా, గీతాంజలి చివరి చిత్రం తమన్నా కథానాయికగా రూపొందుతున్న దటీజ్‌ మహాలక్ష్మిలో నటించారు. గీతాంజలి నంది అవార్డు కమిటీ మెంబర్‌గా కూడా పనిచేశారు.