iDreamPost
android-app
ios-app

అప్పుడూ.. ఇప్పుడూ.. జంగమ్మెట్‌ డివిజనే టాప్‌

అప్పుడూ.. ఇప్పుడూ.. జంగమ్మెట్‌ డివిజనే టాప్‌

గ్రేటర్‌ పోరులో ప్రజల తీర్పు ఇవ్వబోయేది నేడే. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో గ్రేటర్‌ ఓటర్‌ తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. నేడు ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభం కానుంది. సాయంత్రం 6 వరకూ కొనసాగనుంది. ఇదిలా ఉండగా.. గ్రేటర్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా జంగమ్మెట్‌ డివిజన్‌ హాట్‌ టాపిక్‌గా మారుతోంది. అత్యధిక మంది అభ్యర్థులు పోటీ చేస్తున్న డివిజన్‌గా పేరు పొందుతోంది. 2016లోనూ, 2020లోనూ ఈ డివిజనే టాప్‌లో నిలిచింది.

2016లో 28

గ్రేటర్‌లోని 150 డివిజన్లలో అత్యధికంగా పోటీపడుతున్న అభ్యర్థులు 2016 ఎన్నికల్లో జంగమ్మెట్‌ డివిజన్‌లోనే ఉన్నారు. ప్రాంతం పరంగా ఇదేమీ అంత ప్రాచుర్యం ఉన్నదేమీ కాదు. అయినప్పటికీ నాడు అంత మంది ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కారణం.. చానాళ్ల తర్వాత ఈ డివిజన్‌ ను జనరల్‌ కు కేటాయించడమే. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని ఈ డివిజన్‌లో పాగా వేసేందుకు నాడు ప్రధాన పార్టీలన్నీ పోటీపడ్డాయి. టికెట్‌ ఆశించి భంగపడిన ఆశావహుల్లో కూడా కొందరు పోటీలో నిలబడ్డారు. దీంతో అభ్యర్థుల సంఖ్య 28 అయింది. వార్డుల పునర్విభజనలో భాగంగా జంగమ్మెట్‌ డివిజన్‌లో స్వల్ప మార్పులు జరిగాయి. డివిజన్‌లో మొత్తం 44,122 మంది ఓటర్లు ఉన్నారు. హిందువుల ఓట్లు 23,255 ఉండగా, మిగిలిన ఓట్లలో 99 శాతం ముస్లింలవే.

2020లో 20

ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్‌ ఎన్నికల్లో కూడా జంగమ్మెట్‌ డివిజన్‌ నుంచే అత్యధిక మంది పోటీ చేస్తున్నారు. ఇక్కడి నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా ఈ డివిజన్‌ టాప్‌లో నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈసారి అత్యల్పంగా ఉప్పల్‌, బార్కస్‌, నవాబ్‌సాహెబ్‌ కుంట, టోలిచౌకి, జీడిమెట్లలో ముగ్గురు చొప్పున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మెజార్టీ డివిజన్లలో పది మందిలోపే అభ్యర్థులు ఉండడంతో జంబో బ్యాలెట్‌ అవసరం లేకుండా పోయింది.