Idream media
Idream media
చెప్పుకోవడానికి కో ఆప్షన్ ఎన్నికలే అయినా… గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు ప్రాంతాల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో వినూత్న పరిణామాలు జరుగుతున్నాయి. బలం ఉన్నా, లేకపోయినా కొన్ని స్థానాల్లో ఇరు పార్టీలు సై అంటే సై అంటున్నాయి. కొత్తగా ఏర్పడ్డ 7 కార్పొరేషన్ లు, 7 మున్సిపాల్టీల్లో కరోనా కాలంలోనూ రాజకీయ కళ కనిపిస్తోంది. స్థానికంగా ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహ, ప్రతివ్యూహాలతో మినీ సంగ్రామాన్ని తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల అధికార పార్టీ ఖరారు చేసిన అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేసినా.. మళ్లీ అదే పార్టీ నుంచి ఇంకొకరు నామివేషన్ వేస్తున్నారు. చివరకు ఎవరు ఉంటారో.. ఎవరు ఉండరో.. తెలియని పరిస్థితి ఏర్పడింది. 6 నెలల క్రితం జరిగిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల వేడిని తలపించేలా కో ఆప్షన్ రాజకీయాలు ఉండడంతో ఇప్పుడు రాజకీయ పార్టీల చూపు గ్రేటర్ శివారులపై పడింది.
ముఖ్యంగా ఈ స్థానాల్లో…
ప్రధానంగా కార్పొరేషన్ ల పరిధిలోని కో ఆప్షన్ స్థానాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కొత్తగా ఏర్పడ్డ కార్పొరేషన్‌లు కావడం.. రియల్ ఎస్టేట్ పరంగా ఆ ప్రాంతాలకు డిమాండ్ ఏర్పడడంతో ఆ ప్రాంతాల్లో రాజకీయ పదవుల కోసం తీవ్రంగా పోటీ ఏర్పడింది. 7 కార్పొరేషన్‌లలో ముఖ్యంగా బడంగ్ పేట, జవహర్‌నగర్, మీర్ పేట కార్పొరేషన్‌లలో పోటీ రసవత్తరంగా మారింది. జవహర్ నగర్ కార్పొరేషన్ లో 5 కో ఆప్షన్ స్థానాలు ఉండగా 10 నామినేషన్‌లు వచ్చాయి. అందులోనే 8 మంది టీఆర్ఎస్ కు చెందిన వారే కావడం చర్చనీయాంశంగా మారింది. మేయర్ కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు అందరూ కలిసి 5గురిని ఎంపిక చేశారు. నిన్నటి వరకూ వారే రేసులో ఉన్నారు. దీంతో ఏకగ్రీవం అయినట్లు భావించారు. నామినేషన్‌లు కూడా వేశారు. ఊహించని రీతిలో టీఆర్ఎస్ నుంచి గండ్ర నర్సయ్య నిన్న మరో నామినేషన్ వేశారు. అంతేకాకుండా నేరుగా మంత్రి మల్లారెడ్డిని కలిసి తన విజ్ఞప్తిని పరిశీలించాలని కోరారు. దీంతో స్థానిక నాయకత్వం కంగుతింది. నామినేషన్‌కు చివరి రోజైన ఆగస్టు 1న మరో రెండు నామినేషన్‌లు దాఖలయ్యాయి. రాజకీయ సమీకరణాలు ఎప్పుడు, ఎటువైపు మారతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే మీర్ పేట కార్పొరేషన్ పరిధిలో కో ఆప్షన్ పదవిని గత కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ముగ్గురు నేతల్లో ఎవరో ఒకరికి కేటాయించాలని మంత్రి సబితా రెడ్డిని స్థానిక నేతలు కలిశారు. ఇదిలా ఉండగా.. స్థానిక మేయర్, కార్పొరేటర్ ల ఆలోచన మరో విధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా ఉత్కంఠ ఏర్పడింది.