‘మా నియోజకవర్గ ఇంఛార్జి ఎక్కడున్నారో.. ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అందుబాటులో లేని ఆ నేత మాకొద్దు.. కొత్త ఇంఛార్జీని నియమించండి’.. అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ టీడీపీ నేతలు మీడియా ముందుకొచ్చి మరీ డిమాండ్ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లాలోని ఈ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జిగా ఉన్న హరికృష్ణ గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచీ అటు పార్టీకి, ఇటు క్యాడర్ కు అందుబాటులో ఉండటంలేదు. ఫలితంగా నియోజకవర్గంలో పార్టీ దిక్కులేనిది అయ్యిందని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఆయన అధికార పార్టీతో కుమ్మక్కయ్యారని కూడా ఆరోపిస్తున్నారు.
కుతూహలమ్మ నుంచి హరికృష్ణ వరకు..
గంగాధర నెల్లూరు (జి.డి.నెల్లూరు) నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. అంతకుముంది వేపంజేరి నియోజకవర్గంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో జీడీ నెల్లూరుగా మారింది. వేపంజేరి నియోజకవర్గం ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకురాలు కుతూహలమ్మ వరుసగా నాలుగుసార్లు ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పని చేశారు. జీడీ నెల్లూరు నుంచి కూడా 2009లో విజయం సాధించారు.
2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం ఆమె అనారోగ్యానికి గురికావడంతో 2019 ఎన్నికల్లో ఆమె తనయుడు హరికృష్ణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నారాయణ స్వామి ఆయనపై నెగ్గి ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఓటమి తర్వాత హరికృష్ణ నియోజకవర్గంలో కనిపించడం మానేశారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడంలేదని, పంచాయతీ ఎన్నికలను కూడా పట్టించుకోకపోవడంతో టీడీపీ పరిస్థితి దిగజారిందని అంటున్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నారో లేరో అర్థం కావడం లేదంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా నాయకత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.
అతన్ని తప్పించండి
ఈ పరిణామాలతో విసిగిపోయిన టీడీపీకి చెందిన పలువురు దళిత నేతలు ఎస్సార్ పురం మండల టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ తమ ఆక్రోశం వెళ్లగక్కారు. తన వ్యక్తిగత అవసరాల కోసం ఇంఛార్జి హరికృష్ణ వైఎస్సార్సీపీ నేతలతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఆ పార్టీకి దగ్గరవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో అతన్ని ఇంఛార్జి పదవి నుంచి తప్పించి.. వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని దళిత నేతలు డిమాండ్ చేశారు. కొంతమంది జిల్లా నేతలు వారించడానికి ప్రయత్నించినా వారు శాంతించలేదు.