జగన్ ని ప్రశంసించడంతో టీడీపీ నేతల గొంతులో వెలక్కాయ
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తన రూటే సెపరేటు అన్నట్టుగా సాగుతున్నారు. ఇప్పటికే ఈ విశాఖ నార్త్ ఎమ్మెల్యే నైజం టీడీపీకి మింగుడుపడడం లేదు. తన దారి తాను చూసుకోవడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆయన తొలిసారిగా ఓ అడుగు వేశారు. అదికూడా టీడీపీ అధినేతకు కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా వైజాగ్ స్టీల్ పేరుతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ మరునాడే ముఖ్యమంత్రి జగన్ ని అభినందించారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలపై సీఎం జగన్ వైఖరికి గంటా ప్రశంసలు కురిపించారు. ఇది టీడీపీ క్యాంపుని కలవరపెడుతోంది. టీడీపీ అధిష్టానాన్ని ఇరకాటంలో నెట్టింది.
విశాఖ నగరంలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అందులో గంటా శ్రీనివాసరావు ఒకరు. ప్రస్తుతం ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం పేరుతో అసెంబ్లీకి రాజీనామా చేశారు.ఇక మిగిలిన వారిలో మొన్నటి వరకూ అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన వాసుపల్లి గణేష్ కొన్ని నెలల క్రితమే జై జగన్ అనేశారు. మిగిలిన ఇద్దరిలో గణబాబు ప్రస్తుతానికి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో చంద్రబాబు వైఖరి ఆయనకు రుచించడం లేదు. అదే సమయంలో టీడీపీ భవితవ్యం మీద ఆయన సందిగ్ధంలో ఉన్నారు. ఇక నాలుగో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఏం చేస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. స్టీల్ ఉద్యమం కోసం గంటా రాజీనామా చేసినప్పుడు మిగిలిన టీడీపీ నేతల మీద ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ప్రతిపక్షం పదే పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు తొలుత తన వైఖరి ప్రకటించాల్సి ఉంటుందని కార్మికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. గంటా బాటలో ఆయా ఎమ్మెల్యేలు సాగాలని కోరుతున్నారు. ఇది టీడీపీ నేతల గొంతులో స్టీల్ వెలక్కాయ వేసినట్టవుతోంది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తామంతా అవసరమైతే రాజీనామాలకు సిద్ధమని ఇప్పటికే విశాఖ, అనకాపల్లి ఎంపీలు ప్రకటించారు. వైఎస్సార్సీపీకి చెందిన నేతలంతా విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కార్మికుల ఉద్యమంలో పాల్గొంటున్నారు. టీడీపీ నేతలు మాత్రం ఉద్యమం విషయంలో సందిగ్ధంలో ఉన్నారు గతంలో చంద్రబాబు హయంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఖాయిలాపడిన పరిశ్రమ జాబితాలో వేయాలని చూసిన విషయాన్ని కార్మికులు మరచిపోలేదు. చంద్రబాబు భాగస్వామిగా ఉన్న వాజ్ పాయ్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే తొలుత స్టీల్ ప్లాంట్ వాటాల అమ్మకానికి పూనుకుంది.అప్పట్లో కార్మికులు బాబు, బీజేపీ తీరు మీద దండెత్తారు. ప్రైవేటీకరణ యత్నాలు అడ్డుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు స్టీల్ ప్లాంట్ గురించి ఎంతగా మాట్లాడినా గతంలో అధికారంలో ఉండగా ఆయన వ్యవహరించిన తీరు కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు.
అదే సమయంలో 2015 వరకూ లాభాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే నష్టాల బాట పట్టడం పట్ల పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ప్రభుత్వాల వైఫల్యం కాగా ప్లాంట్ మీద నెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్కు ఉద్యమంలో కూడా టీడీపీ ఒంటరిపాటు అయ్యే ప్రమాదం దాపురిస్తోంది. పైగా విశాఖలో అడుగుపెట్టేందుకు చంద్రబాబు సతమతం అవుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే గంటా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయం టీడీపీని గుబులు రేపుతోంది.