iDreamPost
android-app
ios-app

‘గడియారం’ టైం మొదలైంది

‘గడియారం’ టైం మొదలైంది

మహా రాష్ట్ర లో ప్రభుత్వ ఏర్పాటు అంశం రోజుకో మలుపు తిరుగుతూ ఫుట్ బాల్ గేమ్ ను తలపిస్తోంది. మొన్న బిజెపి, నిన్న శివసేన, నేడు ఎన్సీపీ కోర్టులోకి బంతి చేరింది. ఈ రోజు గడియారం గుర్తు పార్టీ కి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే టైం వచ్చింది. గడియారం తనకు వచ్చిన టైం ను సద్వినియోగం చేసుకుంటుందా..? లేదా..? అన్న విషయం ఈ రోజు రాత్రి 8:30 గంటలకు తేలిపోతుంది. 

నిన్న సోమవారమంతా ప్రభుత్వ ఏర్పాటు పై శివసేన మల్లగుల్లాలు పడింది. మొదట ప్రభుత్వ ఏర్పాటుకు అసెంబ్లీ సీట్ల సంఖ్య 105 తో పెద్ద పార్టీగా ఉన్న బిజెపి ని గవర్నర్ ఆహ్వానించారు. అయితే తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదంటూ బిజెపి విముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 56 సీట్ల తో రెండో పెద్ద పార్టీగా నిలిచినా శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. సోమవారం రాత్రి 7:30 గంటల వరకు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే.

శివసేన కు 54 సీట్ల గల ఎన్సీపీ మద్దతు ఖాయమైంది. ఎన్సీపీ షరతుల మేరకు కేంద్రంలోని తన ఏకైక మంత్రితో శివసేన రాజీనామా చేయించింది. ఈ రెండు పార్టీల సంఖ్య బలం 110 కాగా మ్యాజిక్ ఫిగర్ 145 సీట్లు. 44 సీట్ల గల కాంగ్రెస్ మద్దతు కోసం శివసేన తీవ్రంగా ప్రయత్నించింది. కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ ద్వారా మంతనాలు జరిపింది. కానీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం రెండు సార్లు సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చివరకు శివసేనకు మొండి చేయి చూపింది. గవర్నర్ ఇచ్చిన గడువు 7:30 గంటలకు 5 నిమిషాల ముందు తమ మద్దతు లేదని ప్రకటించింది. దింతో శివసేన ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి రెండు సార్లు ఫోన్ చేసినా నిరాశే ఎదురైంది. మరికొద్ది సమయం ఇవ్వాలని శివసేన విజ్ఞప్తిని గవర్నర్ తిరస్కరించారు. 

ఇక  మంగళవారం రాత్రి 8:30 గంటల లోపు ప్రభుత్వ ఏర్పాటు చేయాలని మూడో పెద్ద పార్టీ అయిన ఎన్సీపీకి గవర్నర్ అవకాశం ఇచ్చారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రయత్నాలు మెదలు పెట్టారు. తన మిత్రపక్షమైన కాంగ్రెస్ మద్దతు ఎన్సీపీకి ఎలాగూ ఉంటుంది. ఎన్నికల్లో ఇరు పార్టీలు పొత్తుపెట్టుకుని పోటీచేశాయి. ఐతే శివసేన మద్దతు ఇప్పుడు ఉంటుందా..? అన్నదే ప్రశ్న. ఒక వేళ మద్దతు ఇస్తే ప్రభుత్వంలో చేరుతుందా..? లేదా బయట నుంచి మద్దతు ఇస్తుందా..? అన్నఅంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి.  మరో వైపు శివసేనతో కలసి వెళ్లేందుకు ఇష్టపడని కాంగ్రెస్ ఎన్సీపీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో శివసేన తో కలసి నడుస్తుందా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. అన్ని ప్రశ్నలకు ఈ రోజు రాత్రి 8:30 గంటలకు సమాధానం రానుంది. ఎన్సీపీ కూడా ప్రభుత్వ ఏర్పాటులో విఫలమైతే.. రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫార్సు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.