రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. మిత్రులు, ప్రత్యర్థులుగా మారడం.. ప్రత్యర్థులు, మిత్రులుగా మారడం దేశ రాజకీయాల్లో చాలా సహజం. ప్రస్తుతం ప్రత్యర్థులుగా ఉన్న బీజేపీ-శివసేనల మధ్య మళ్లీ స్నేహం చిగురిస్తుందనేలా ప్రస్తుత పరిణామాలు, నేతల మాటలు ఉన్నాయి. 2019 నుంచి బీజేపీ పై విరుచుకు పడుతున్న శివసేన నేతలు.. ప్రస్తుతం తమ వెర్షన్ మార్చారు. పాత మిత్రత్వం తాలూకా అవశేషాలు ఇంకా మిగిలి ఉన్నాయని చెప్పకనే చెబుతున్నారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే చేసిన ఓ ప్రామిస్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. శివసేన వర్సెస్ బీజేపీ గా ఉన్న ఇక్వేషన్ కాస్తా.. బీజేపీ+శివసేనగా మారే అవకాశముందనే ఊహాగానాలు వస్తున్నాయి.
ఔరంగాబాద్ లో జరిగిన ఓ ప్రభుత్వం కార్యక్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే.. అదే కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్ సాహెబ్ దన్వేను ఉద్దేసిస్తూ ‘ఫ్యూచర్ కొలిగ్’ అని సంబోధించారు. ముంబై- నాగ్ పూర్ మధ్య బుల్లెట్ రైలు మార్గం తీసుకొస్తే మీతోనే ఉంటానని కేంద్రమంత్రితో సీఎం ఠాక్రే ప్రామిస్ చేశారు. దీనికి స్పందించిన కేంద్రమంత్రి రావుసాహెబ్ దన్వే ..శివసేన-బీజేపీ కలిస్తే ఓటర్లు సంతోషంగా ఉంటారన్నారు.
ఉద్దవ్ ఠాక్రే సన్నిహితుడిగా పేరున్న రాష్ట్ర మంత్రి అనిల్ పరాబ్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ చర్యలు ప్రారంభించిన తర్వాత సీఎం ఉద్దవ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం ఉద్దవ్ పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రమంత్రి నారాయణ రాణే ను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడంలో అనిల్ పరాబ్ కీలకంగా వ్యవహరించారరనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటన తర్వాతే ఈడీ సమన్లు జారీ అయ్యాయి. బలవంతపు వసూళ్లకు కూడా అనిల్ పరాబ్ పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
Also Read : జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ,డీజిల్ – రాష్ట్రాలపై నెపం నెడితే సరిపోతుందా?
మారిన మాట తీరు…
మహా వికాస్ అఘాడియా ఏర్పాటులోనూ, ఉద్దవ్ సీఎం అవడంలోనూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో బీజేపీపై విమర్శలతో విరుచుకుపడేవారు. ప్రస్తుతం ఆయన ధోరణిలో మార్పు వచ్చింది. పీఎం మోదీ బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన రౌత్ .. మోదీపై ప్రశంసలు కురిపించారు. దేశంలో మోదీని మించిన నాయకుడు లేరని ప్రకటించారు. మోదీ పై రౌత్ అకస్మాత్తుగా ప్రేమ కురిపించడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బీజేపీతో మైత్రి కోసమే ఈ ప్రశంసలు చేశారా..? లేదా కేవలం పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపి కొనియాడారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అయితే తర్వాత ప్రెస్ మీట్ లో తన ప్రకటనపై ఉద్దవ్ ఠాక్రే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘ఫ్యూచర్ కొలిగ్ అంటే అర్థం ఎంటో కాలమే సమాధానం చెబుతుందని’ వివరించారు. రాజకీయాల్లో వికృత పోకడలు సరికాదన్న ఠాక్రే.. వాటికి ముగింపు పలకాలన్నారు. రాష్ట్రంలో మహారాష్ట్ర అఘాడియా ప్రభుత్వం ఉందని.. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉందని గుర్తు చేశారు. అంతిమంగా తమ పదవులు, హోదా ను ఉపయోగించి రాష్ట్రానికి మేలు చేయాలన్నారు. రాక్రే ప్రకటనపై స్పందిచిన బీజేపీ నేత, ప్రతిపక్ష నాయకుడు ఫడ్నవీస్.. బీజేపీ-శివసేన కలిసే అవకాశాలు ప్రస్తుతం లేవన్నారు.
ఒకప్పటి మిత్రులైన ఈ రెండు పార్టీలు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థులుగా మారారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజారీటీ రాకపోవడంతో సీఎం పీఠం కోసం మిత్రులు కాస్తా ప్రత్యర్థులుగా మారారు. 30 ఏళ్ల మిత్రబంధం తెగిపోయి విరోధులుగా మారారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి మహా వికాస్ అఘాడియాగా ఏర్పడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
Also Read : బీజేపీకి బిగ్ షాక్: బాబుల్ సుప్రియో రీఎంట్రీ